లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
• రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ.. సమానత్వాన్ని పాటించాలి.
సూర్య, లక్షెట్టిపేట: లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడంతో పాటు, రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను కూడా నిబద్ధతతో పాటించాలని సూచించారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడం రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పౌరులందరూ రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ సమాజంలో సోదరభావం, సమానత్వం, ఐక్యతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, చైర్‌పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్‌పర్సన్ రాజేశ్వరి, కౌన్సిలర్లు, నాయకులు దొంత నర్సయ్య, చింత అశోక్ కుమార్, ఆరిఫ్, వెంకటస్వామి గౌడ్, రమేష్, కోటి, హాజీ, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.