ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యం నామినేషన్ కేంద్రాలు, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అంకితా సురానా
తాడిమర్రి సూర్య రిపోర్టర్ బండారు వెంకటేష్ : - స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఎస్పీ అంకిత్ సురానా తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఎస్పీ అంకిత్ సురానా పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన కార్యాలయాలు, అక్కడ కల్పించిన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా గత ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు, సమస్యాత్మక వ్యక్తులు, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించే అవకాశం ఉన్న వారి వివరాలను పరిశీలించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ముందస్తు నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో కదిరి డీఎస్పీ శివ నారాయణ స్వామి, సీఐ సునీత, ఎస్సై కృష్ణవేణి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.