ప్రజలకు కుళాయి నీరు.. అధికారులకు ఆర్వో వాటరా?
అధికారులూ ప్రజలు తాగే నీటినే తాగాలని డిమాండ్
జీవీఎంసీ నీటి సరఫరాలో ద్వంద్వ ప్రమాణాలపై వాయిస్ ఆఫ్ వైజాగ్ నేత వి.వి. వామనరావు విమర్శలు
సీతమ్మధార, మేజర్ న్యూస్: ప్రజలకు అత్యంత సురక్షితమైన, శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్న జీవీఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం ఆ నీటిని తాగేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని శ్రమశక్తి అవార్డు గ్రహీత, వాయిస్ ఆఫ్ వైజాగ్ వేదిక వ్యవస్థాపకుడు వివి వామనరావు ప్రశ్నించారు. ప్రజలకు కుళాయి నీటిని సరఫరా చేస్తూ, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆర్వో ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీరు, బ్రాండెడ్ వాటర్ బాటిళ్లు అందించడం ఏ విధమైన న్యాయమని నిలదీశారు. విశాఖలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జీవీఎంసీ నీటి సరఫరా విధానం, సీఐఐ సదస్సు నిర్వహణకు చేసిన ఖర్చులపై పలు విమర్శలు చేశారు.అనకాపల్లి నుంచి భీమిలి వరకు విస్తరించిన జీవీఎంసీ పరిధిలో సుమారు 25 లక్షల మంది జనాభా ఉన్నారని, రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్లలో ఇదొకటని వామనరావు తెలిపారు. నగరంలోని పది వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా ప్రతిరోజూ 489 ఎంఎల్‌డీ ముడి నీటిని సేకరించి, శుద్ధి అనంతరం 400 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఇందులో 90 ఎంఎల్‌డీ నీటిని పరిశ్రమలకు బల్క్ వాటర్‌గా అందిస్తుండగా, మిగిలిన 310 ఎంఎల్‌డీ నీటిని గృహ అవసరాల కోసం ప్రజలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. నీటి నాణ్యతను నిర్ధారించేందుకు క్లోరినేషన్ తనిఖీలు, మొబైల్ వాటర్ టెస్టింగ్ వాహనం వంటి ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారని గుర్తుచేశారు.ప్రజలకు సరఫరా చేస్తున్న నీరు నాణ్యమైనదే అయితే జీవీఎంసీ కమిషనర్, విభాగాధిపతులు (హెచ్‌ఓడీలు) అదే నీటిని ఎందుకు వినియోగించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆర్వో ప్లాంట్ల ద్వారా నీటిని మరింత శుద్ధి చేసి క్యాన్లలో కమిషనర్ బంగ్లా, పేషీ, కార్యాలయంతోపాటు హెచ్‌ఓడీలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు బ్రాండెడ్ వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రజలు తాగే నీటిపై అధికారులకు నమ్మకం లేనప్పుడు దాని నాణ్యతపై ప్రజలకు ఎలా భరోసా కల్పిస్తారని నిలదీశారు.ఇటీవల విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రతినిధులకు తాగునీటి సరఫరా కోసమే జీవీఎంసీ సుమారు రూ.1.30 కోట్లు ఖర్చు చేసిందని వామనరావు ఆరోపించారు. ప్రజలకు అందిస్తున్న కుళాయి నీరు సురక్షితమైనదే అయితే దేశవిదేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులకు కూడా అదే నీటిని అందించి నగర ప్రతిష్టను పెంచుకోవాల్సిందన్నారు. ప్రజాధనంతో నిర్వహించే సమావేశాలు, సదస్సుల్లో బ్రాండెడ్ వాటర్ బాటిళ్ల కొనుగోలుకు ఇకపై ఖర్చు చేయకూడదని డిమాండ్ చేశారు.
అధికారులకు కుళాయి నీటిపై నిజంగా నమ్మకం ఉంటే కమిషనర్ బంగ్లా, కార్యాలయాలతోపాటు హెచ్‌ఓడీలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్వో ప్లాంట్లను మూసివేసి సాధారణ నీటినే వినియోగించాలని సూచించారు. ఒకవేళ కుళాయి నీరు తాగేందుకు అనువుగా లేదని భావిస్తే నగరంలోని 25 లక్షల మంది ప్రజలకూ ఆర్వో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని స్పష్టం చేశారు. పన్నులు చెల్లిస్తున్న ప్రజలకు ఒకరకమైన నీరు, అధికారులకు మరోరకమైన నీరు అందించడం వివక్షతో కూడుకున్నదని విమర్శించారు.తాను నాలుగు దశాబ్దాలుగా కార్మిక నాయకుడిగా పనిచేస్తున్నానని, కార్పొరేషన్ వ్యవహారాలపై 42 ఏళ్ల అనుభవం ఉందని వామనరావు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 50వ వార్డు నుంచి బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేసినప్పటికీ, పొత్తులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలను ప్రశ్నించడానికి కార్పొరేటర్ పదవి అవసరం లేదనే ఉద్దేశంతో 'వాయిస్ ఆఫ్ వైజాగ్' పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, అధికారుల దృష్టికి వాటిని తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు.