పంటల పరిశీలన.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు! కొమరోలులో కృషోన్నతి యోజన కార్యక్రమం
పంటల పరిశీలన.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు!
కొమరోలులో కృషోన్నతి యోజన కార్యక్రమం
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
మండల పరిధిలోని కొమరోలు గ్రామంలో శనివారం కృషోన్నతి యోజన కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులు సాగు చేస్తున్న క్రిసాంతిమం, వంగ, స్వీట్ ఆరెంజ్ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంటల్లో ఎదురవుతున్న పురుగులు, తెగుళ్ల సమస్యలను గుర్తించారు.
ఈ సందర్భంగా రైతులకు పంటల యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్త సుజాత సూచనలు చేశారు. స్వీట్ ఆరెంజ్ తోటల్లో దెబ్బతిన్న కొమ్మలు, పండ్లను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని, పంటలకు అవసరమైన సూక్ష్మపోషకాలను సరైన మోతాదులో అందించాలని తెలిపారు. ఫార్ములా-4ను లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. వంగ, ఇతర కూరగాయ పంటల్లో పురుగులు, తెగుళ్ల నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని వివరించారు.
2026–27 సంవత్సరానికి సంబంధించి SMAE–ఆత్మ (ATMA) పథకంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కర్నూలు ఏడీఏ అల్తాఫ్ అలీ ఖాన్, డీఆర్సీ ఏడీఏ అన్నపూర్ణ, ఏఓ హేమలత, డీఏఏటీసీ శాస్త్రవేత్త సుజాత, మండల వ్యవసాయ అధికారి, ఎంఈపీఓలు, రైతులు పాల్గొన్నారు.