ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ విషప్రచారం – విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం : ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్
అమరావతి, మేజర్‌న్యూస్ :
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, విద్యా విధానం, ఫీజు రీయింబర్స్మెంట్ గురించి వైసీపీ నాయకత్వం మాట్లాడుతుంటే 'దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా' ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయాక ఏది పడితే అది మాట్లాడొచ్చనే ఒక వింత పోకడకు వైసీపీ నేతలు తెరలేపారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి, పదవి నుంచి దించేసిన సమయంలో రాష్ట్రంలో మీరు ఎన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్లారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. గత ఐదేళ్ల పాలనలో విద్యా రంగాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసి, విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది వైసీపీ ప్రభుత్వమే. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు తమ సర్టిఫికెట్లు కూడా తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలేజీ యాజమాన్యాలను, తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసి, ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
విద్యా వ్యవస్థ నుంచి అభివృద్ధి పనుల వరకు ప్రతి రంగంలోనూ బకాయిలు పెట్టిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానిదే
గత వైసీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో చిన్న పిల్లల చదువుల నుంచి సాంకేతిక విద్య, ఆరోగ్యశ్రీ, రైతులు, కాంట్రాక్టర్ల వరకు అన్ని రంగాల్లో వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. గతంలో అమ్మఒడి (తల్లికి వందనం), సాంకేతిక విద్య, ఆరోగ్యశ్రీ పథకాలలో భారీగా బకాయిలు పెట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనులు చేసిన కాంట్రాక్టర్లకు, గ్రామీణాభివృద్ధికి ఉపాధి హామీ నిధులతో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టారు. పైగా, సీఎఫ్ఎంఎస్ అనే కొత్త విధానాన్ని అడ్డుపెట్టుకుని, కేవలం మీ మద్దతుదారులకు, మీకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే నిధులు మంజూరు చేసి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. గత ప్రభుత్వం పెట్టిన ఈ బకాయిలన్నింటినీ కూటమి ప్రభుత్వం భారం అనుకోకుండా తన బాధ్యతగా స్వీకరించింది. రైతులకు రావాల్సిన బకాయిలను చెల్లించడంతో పాటు, విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పాత బకాయిలను దశలవారీగా తీరుస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నాం. విద్యార్థులపై ఎలాంటి మానసిక, శారీరక ఒత్తిడి తీసుకురావద్దని, ఫీజుల విషయంలో ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని కాలేజీ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. 2019–24 మధ్య కాలంలో ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా ఫీజు ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసి, మీకు అనుకూలమైన కాలేజీలకు ఫీజులు పెంచి, మిగతా కాలేజీల్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నా కనీస ఫీజును రూ. 35,000 కు తగ్గించి కక్ష సాధింపులకు పాల్పడ్డారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు సరైన విద్యా విధానం లేకుండా విద్యార్థి లోకాన్ని మోసం చేశారు. పీజీ రీయింబర్స్మెంట్ కింద రూ. 450 కోట్లు బకాయి ఉంటే, కాలేజీ యాజమాన్యాలను పిలిచి 75 శాతం ఇస్తామని సంతకాలు తీసుకుని చివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేసిన చరిత్ర మీది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా అన్ని విద్యా సంస్థలను బతికించాలనే లక్ష్యంతో సగటు ఫీజును రూ. 45,000 కు సవరించింది. అంతేకాకుండా, ఫీజు రీయింబర్స్మెంట్ కింద 2024–25లో రూ. 1,450 కోట్లు, 2025–26లో రూ. 1,666.21 కోట్లు, ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1,845 కోట్లు.. వెరసి మొత్తం రూ. 4,962 కోట్లు కేటాయించి విద్యా రంగానికి అండగా నిలిచింది. కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రతి యువకుడికి నాణ్యమైన సాంకేతిక విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
ఊరికే బటన్లు నొక్కడం కాదు.. ఖాతాల్లో డబ్బులు పడాలి
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి తీరని ద్రోహం జరిగిందని, ఊరికే బటన్లు నొక్కడం కాకుండా అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేయడమే తమ ప్రభుత్వ చిత్తశుద్ధి అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాం, చేసేదే చెప్తాం. కానీ గత ప్రభుత్వంలో అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పేరుతో విద్యార్థి లోకాన్ని మోసం చేశారు. వసతి దీవెన కింద హాస్టళ్లకు బకాయిలు పెట్టడమే కాకుండా, కొన్ని చోట్ల మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఎత్తివేసి పేద విద్యార్థుల పొట్టకొట్టారు. ఫీజుల నిర్ధారణ (ఫీజ్ ఫిక్సేషన్), అడ్మిషన్ల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం వల్ల మన రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం కావాలి.. మా పిల్లలకు వద్దా?' అంటూ రాజకీయ లబ్ధి కోసం మాటలు చెప్పారే తప్ప, క్షేత్రస్థాయిలో సరైన అమలు లేకుండా చేశారు. 'నాడు-నేడు' పథకం కింద రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకున్నా, ఏ ఒక్క పాఠశాల కూడా పూర్తిస్థాయిలో, నాణ్యతతో నిర్మించలేదు. గుడి లాంటి బడుల నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడి, ప్రధానోపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి వారి ఆత్మహత్యలకు కారణమయ్యారు. గతంలో 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేశాం. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వైసీపీ పెట్టిన బకాయిలన్నింటినీ మా బాధ్యతగా స్వీకరించి సరిదిద్దుతున్నాం. సామాన్య పేద విద్యార్థి టెన్త్ క్లాస్‌లో మెరిట్ సాధిస్తే వారి ఫోటోలను పత్రికల మొదటి పేజీలో ప్రచురించి ప్రోత్సహించే విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటినీ ఒకే రీతిలో చూస్తూ, వాటి సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఒకటి రెండు రోజులు అటుఇటు అయినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని కాలేజీ యాజమాన్యాలకు భరోసా ఇస్తున్నాం. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులకు, యాజమాన్యాలకు అండగా నిలుస్తున్నారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా ముసలి కన్నీరు కార్చడం, మోసపూరిత మాటలతో ప్రజలను భ్రమలకు గురిచేయడం మానుకోవాలి. రాష్ట్ర అభివృద్ధికి, విద్యా వ్యవస్థకు అడ్డుపడాలని చూస్తే నష్టపోయేది మీరేనని ఆలపాటి రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.