సూర్య మోపాల్ / దర్పల్లి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆకాంక్షించారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.గురువారం ధర్పల్లి మండలం హొన్నాజిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ (SGF) మండల స్థాయి క్రీడోత్సవాలను ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని వెలిగించి, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండలంలోని 25 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు ఎమ్మెల్యేకు గౌరవ వందనం సమర్పించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడాకారుల ఉత్సాహభరిత సందడితో కార్యక్రమం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలను ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. క్రీడల వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్నేహభావం, జట్టుగా పనిచేసే తత్వం పెంపొందుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని చెప్పారు. అందులో భాగంగానే విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి క్రీడా శిక్షణ అందించాలనే లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు.విద్యార్థులు మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మైదానాల వైపు దృష్టి సారించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా చేసిన తప్పులను సరిదిద్దుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఓటమి విజయానికి నాంది పలుకుతుందని, క్రీడాస్ఫూర్తితో లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.