telangana
భూముల రిసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్
సూర్య బాన్సువాడ రూరల్: బాన్సువాడ మండల పరిధిలోని వాసుదేవపల్లి రెవెన్యూ గ్రామంలో చేపట్టిన భూముల రీ-సర్వే, గ్రామ సరిహద్దుల నిర్ధారణ పనులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి రైతు, పట్టాదారుడికి సంబంధించిన భూముల హద్దులను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా గుర్తించి, భూముల విస్తీర్ణం, సరిహద్దులు తదితర వివరాలను సమగ్రంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా భూ రికార్డులను సరిచూసి, ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా పారదర్శకంగా సర్వే ప్రక్రియను నిర్వహించాలని సూచించారు.రైతులు, పట్టాదారులు తమ భూములకు సంబంధించిన హద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవడానికి ఈ రీ-సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో భూ సంబంధిత వివాదాలకు తావులేకుండా ప్రతి భూమికి సంబంధించిన వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీ-సర్వే, గ్రామ సరిహద్దుల నిర్ధారణ పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి, బాన్సువాడ తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్, ఉప సర్వేయర్ తిరుమలేష్, సర్వేయర్ మధు, లైసెన్స్ పొందిన సర్వేయర్లు సాజిద్, అలీం ఖాన్, గిర్దావర్ రాజు, జూనియర్ సహాయకుడు, గ్రామ ప్రణాళిక అధికారి గంగాధర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.