పేట అభివృద్ధికి ఓటుతో ప్రత్యూషకు అవకాశం ఇవ్వండి..
– ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న జామి వెంకట్రావు
నరసన్నపేట నవంబర్ 24 మేజర్ న్యూస్ : నరసన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి అధికార కూటమి మద్దతుతో పోటీ చేస్తున్న జామి ప్రత్యూషకు ప్రజలు అవకాశం కల్పించాలని ఆమె మామయ్య జామి వెంకట్రావు కోరుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన అన్నీ తానై ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు.
ఈ సందర్భంగా జామి వెంకట్రావు మాట్లాడుతూ నరసన్నపేట పట్టణంలో ప్రధాన సమస్యలైన తాగునీరు, పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు రాజుల చెరువు అభివృద్ధి, కళాశాల రహదారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అవినీతికి తావులేని పారదర్శక పాలన అందిస్తూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
పట్టణ సమస్యలపై జామి ప్రత్యూషకు పూర్తి అవగాహన ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పెద్దల సహకారంతో నరసన్నపేటలో గతంలో ఎన్నడూ చూడని రీతిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరూ పెద్ద మనసుతో ఆదరించి జామి ప్రత్యూషకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు సభ్యుల అభ్యర్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.