పెనుగొండ సర్పంచ్ అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావు నామినేషన్ #కూటమి నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ.. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యమని వెల్లడి
వాసవి పెనుగొండ, మేజర్ న్యూస్: పెనుగొండ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి కుడిపూడి శ్రీనివాసరావు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆశీస్సులతో ఆయన నామినేషన్ కార్యక్రమం కూటమి శ్రేణులు, అభిమానుల ఉత్సాహం మధ్య ఘనంగా సాగింది.నామినేషన్ కార్యక్రమంలో భాగంగా తొలుత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా కుడిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పెనుగొండ గ్రామం మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గ్రామంలోని ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
రిపోర్టర్ : ప్రహరాజు వెంకట్రామయ్య ,పెనుగొండ , పశ్చిమగోదావరి జిల్లా