telangana
ఇంటర్మీడియట్ విలీన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :రాష్ట్రంలో 9, 10 తరగతుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డెమొక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (డాటా) డిమాండ్ చేసింది. విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఆ సంఘం నేతలు మండిపడ్డారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ మంగజనది, ప్రధాన కార్యదర్శి, కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యావేత్త ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 70 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ సంస్థల్లోనే చదువుతున్నారని, ఈ నిర్ణయంతో కార్పొరేట్ సంస్థలు 9వ తరగతి నుంచే పోటీ పరీక్షల శిక్షణ పేరుతో లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచే నూతన విధానాన్ని అమలు చేస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 426 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులను పాఠశాలలకు బదిలీ చేస్తే, బోధనా శాస్త్రం (సైకాలజీ) తెలియని వారు 9, 10 తరగతుల విద్యార్థులకు ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. పాఠశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులకు సరిపడా అదనపు గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు లేకుండా నాలుగు నెలల్లో మార్పులు చేయడం అసాధ్యమన్నారు. 1971లో పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఇంటర్మీడియట్ విద్యా విధానం వల్లే నేడు జాతీయ స్థాయి ఇంజనీరింగ్, వైద్య ప్రవేశ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు సైతం ఇక్కడి విద్యా విధానాన్ని చూసి చదువుకోవడానికి వస్తుంటే, ఇంతటి మెరుగైన వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా బలహీన వర్గాలు, మైనారిటీలను ఉన్నత విద్యకు దూరం చేసేందుకే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 2,225 పోస్టుల్లో కేవలం 429 పోస్టులనే భర్తీ చేస్తున్నారని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసి నర్సరీ నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విలీన నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోకపోతే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, మేధావులను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.