తప్పనిసరి నిబంధనలపై స్పష్టత ఇవ్వాలి: అన్సార్ హుస్సేన్
సోమాజిగూడ/మేజర్ న్యూస్ :4 హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త రిజిస్ట్రేషన్ నిబంధనలతో కొనుగోలుదారులు, విక్రయదారులు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముహమ్మద్ అన్సార్ హుస్సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం పై చర్చించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశం లో ఆయన మాట్లాడుతూ
కొత్త నిబంధనల ప్రకారం ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు నిర్మించిన ఇళ్లు, ఫ్లాట్లకు ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (PTIN), ఖాళీ స్థలాలకు వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VLTIN) తప్పనిసరి చేశారని తెలిపారు. ఈ నంబర్లలో ఏదో ఒకటి లేకపోతే రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ కూడా సాధ్యం కావడం లేదన్నారు.
ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న భవనాలకు PTIN లేకపోవడం, పాత ఆస్తుల రికార్డుల్లో పేర్లు, విస్తీర్ణాలకు సంబంధించిన వ్యత్యాసాలు, ఖాళీ స్థలాలకు VLTIN పొందడంలో ఎదురవుతున్న సమస్యలతో ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బ్యాంకు రుణాలు, గృహ ప్రవేశాలు ఆలస్యమవుతున్నాయని, రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన వేలాది మంది ఉపాధి కూడా ప్రభావితమవుతోందని అన్నారు.
ప్రభుత్వం అండర్ కన్స్ట్రక్షన్ ఆస్తులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని, ఆరు నెలల గడువు ఇచ్చి అప్పటివరకు పాత విధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి, PTIN, VLTIN పొందే విధానాన్ని ఆన్‌లైన్‌లో సులభతరం చేయాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని అన్సార్ హుస్సేన్ హెచ్చరించారు.