హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ అల్తాస్ జానయ్య పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు కార్పొరేట్ శక్తుల కుట్రలో భాగమేనని బీసీ పొలిటికల్ ఫ్రంట్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ నేతలు ఆరోపించారు. ఈ కుట్రలకు బలహీన వర్గాల బిడ్డ జానయ్యను బలికానివ్వమని వారు అన్నారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో బిసి పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్లు ఐలి వెంకన్న గౌడ్, వెలికట్టే విజయ్ కుమార్ గౌడ్ బైరి శేఖర్, వైస్ చైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్, తదితరులు హాజరై మీడియాతో మాట్లాడారు. ఐలి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ విసి అల్తాస్ జానయ్య పై వస్తున్న లైంగిక ఆరోపణలు నిరాధారమైనవిగా చెప్పారు. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీలో బలహీన వర్గాలకు చెందిన బిడ్డ వీసీగా ఉన్నది అగ్రికల్చరల్ యూనివర్సిటీ మాత్రమే అన్నారు. బలహీన వర్గాల వ్యక్తి వీసీగా ఉండడాన్ని తట్టుకోలేని కొన్ని వర్గాలు, కొన్ని శక్తులు ఆయనపై లేని ఆరోపణలను సృష్టిస్తున్నారన్నారు. ఆరోపణలను చేస్తున్న మహిళ ప్రొఫెసర్ ఆధారాలను చూపడంలో విఫలమవుతున్నారని చెప్పారు. ఈ ఆరోపణల వెనుక ఎంతటి పెద్ద శక్తులు ఉన్నా తామ అడ్డుకొని తీరుతామని అన్నారు. వీసీగా జానయ్య ఆధ్వర్యంలో యూనివర్సిటీలో దశాబ్దాలుగా పరిష్కారం కానీ ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నాడని తెలిపారు. ఈ అక్కస్సుతో పన్నిన కుట్ర భాగమే ఈ లైంగిక ఆరోపణలని తేల్చి చెప్పారు ఆరోపణలు నిజం కాకమునుపే వీసీగా రాజీనామా చేయాలని కోరడం హాస్యాస్పదమన్నారు. దళిత, బహుజనులు తెలంగాణ రాష్ట్రంలో వైస్ ఛాన్స్లర్లు కావద్దా అని ప్రశ్నించారు. అల్తాస్ జానయ్య పై అసత్య ఆరోపణలు మానుకోకుంటే దళిత, బహుజనులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించి బీసీలకు అండగా నిలవాలని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బడే సాహెబ్, బీసీ రచయితల సంఘం నాయకుడు డాక్టర్ ఆర్ శ్రీనివాస్, అమరవీరుల రాష్ట్ర సమితి అధ్యక్షుడు సాయికుమార్ ,రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.