శ్రీకృష్ణ నగర్ మార్కెట్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన, ఉచిత క్లాత్ బ్యాగుల పంపిణీ
జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని లయన్స్ క్లబ్ జి.ఎం.టి జిల్లా 320D కోఆర్డినేటర్ లయన్ డాక్టర్ ప్రఫుల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకృష్ణ నగర్ వారపు కూరగాయల మార్కెట్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్ నగర్ మరియు సనత్ నగర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో “సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్” నినాదంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ప్రఫుల్లారెడ్డి మాట్లాడుతూ.. హానికరమైన రసాయనాలు, రంగులతో తయారు చేసే ప్లాస్టిక్ సంచులను వాడటం వల్ల మానవ ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వివరించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా క్లాత్ బ్యాగులను వినియోగించి మన ఆరోగ్యాన్ని, భూమిని సంరక్షించుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. అనంతరం మార్కెట్‌కు కూరగాయల కొనుగోలు కోసం వచ్చిన వినియోగదారులకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ,పర్యావరణ హితమైన క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సమితి చైర్‌పర్సన్ లయన్ అన్యం కోటిరెడ్డి,శ్రీమతి పద్మ, కాలనీవాసులు, మార్కెట్ వినియోగదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.