telangana
పంజాగుట్ట పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతి
సోమాజిగూడ / మేజర్ న్యూస్ : హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 40 ఏళ్ల వయస్సు కలిగిన మహిళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 10వ తేదీన శ్రీనగర్ కాలనీలోని ఇండియన్ బ్యాంక్ ఎదురుగా రోడ్డుపై గుర్తుతెలియని మహిళ అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు డయల్ 112కు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమెకు కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అయితే అదే రోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆమె మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీలోని బాక్స్ నంబర్ 24లో భద్రపరిచారు.
మృతురాలి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఆమె వయస్సు సుమారు 40 సంవత్సరాలు, ఎత్తు 5.3 అడుగులు, ఛాయ తెలుపు, నల్లటి జుట్టు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆమె పేరు, కుటుంబ సభ్యులు, చిరునామా తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని ఎవరైనా గుర్తించినట్లయితే లేదా ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.