స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం వద్ద సీఐటీయూ ధర్నా
గాజువాక, మేజర్ న్యూస్ : విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, కార్మికుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్లాంట్ పరిరక్షణ కోసం డిసెంబరు 1, 2, 3 తేదీల్లో ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు నాయకులు ప్రకటించారు. సీఐటీయూ నాయకులు అయోధ్య మాట్లాడుతూ.. ఉద్యోగుల పెండింగ్ జీతాలతో పాటు రిటైర్డ్ కార్మికుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నిలిపివేసిన హెచ్‌ఆర్‌ఏ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఎల్‌టీసీ, ఎల్‌ఎల్‌టీసీ/ఎల్‌టీఏ సౌకర్యాలను పునరుద్ధరించి, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ను సెయిల్‌లో విలీనం చేయడంతో పాటు బ్యాటరీ, సింటర్ ప్లాంట్, మిల్స్ నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఐక్య పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
రిపోర్టర్ : పీ.కోటిరెడ్డి, గాజువాక ఇంచార్జ్, విశాఖపట్నం