పాటలపై ఆంక్షలు, బెదిరింపులకు దిల్జిత్ దోసాంజ్ స్ట్రాంగ్ కౌంటర్
ప్రముఖ పంజాబీ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిర్వహించిన తన 'ఆరా ఇండియా టూర్' (Aura India Tour) లైవ్ కాన్సర్ట్‌లో ఆంక్షలు, బెదిరింపులపై తనదైన శైలిలో స్పందించారు. తన ప్రదర్శనను అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని, పాటలపై నిబంధనలు విధించారని పేర్కొన్న ఆయన, దివంగత ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇండోరీ రాసిన ప్రసిద్ధ గజల్ పంక్తులను వేదికపై ఆలపించి అభిమానులను ఉర్రూతలూగించారు. కాన్సర్ట్ ప్రారంభానికి ముందు ఇండోర్ మేయర్ కార్యాలయంతో పాటు పలు సంస్థలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం రేపింది. మరోవైపు, పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే కారణంతో 'పటియాలా పెగ్', '5 తారా', 'కేస్', 'జట్ ఉథే ఫైర్ కర్దా' అనే నాలుగు పాటలను లైవ్‌లో పాడకూడదని బాలల సంరక్షణ అధికారులు నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాల మధ్య పోలీసుల కట్టుదిట్టమైన భద్రతతో షో కొనసాగింది.వేదికపైకి వచ్చిన దిల్జిత్ ముందుగా ప్రేక్షకులతో 'జై శ్రీ మహాకాల్' అని నినాదాలు చేయించారు. అనంతరం మాట్లాడుతూ, "ఇది మహాకాల్ భూమి, మమ్మల్ని ఇక్కడికి రాకుండా ఎవరూ ఆపలేరు. మేము గతంలో భయపడలేదు, ఇప్పుడూ భయపడటం లేదు. అభిమానులకు మాట ఇస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే "అగర్ ఖిలాఫ్ హై హోనే దో, జాన్ థోడీ హై... సభీ కా ఖూన్ హై షామిల్ యహాన్ కీ మిట్టీ మే, కిసీ కే బాప్ కా హిందుస్థాన్ థోడీ హై" అంటూ రాహత్ ఇండోరీ షాయరీతో విమర్శకులకు గట్టి సమాధానమిచ్చారు.ఎన్ని అడ్డంకులు ఎదురైనా దిల్జిత్ తన సూపర్ హిట్ పాటలతో పాటు 'సాన్సోం కీ మాలా' వంటి మెలోడీలను ఆలపించి ఇండోర్ ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించారు. అక్టోబర్ 30న ఢిల్లీలో ప్రారంభమైన ఈ ఇండియా టూర్ దేశవ్యాప్తంగా భారీ ఆదరణ పొందుతోంది. కాగా, నవంబర్ 21న అహ్మదాబాద్‌లో జరగనున్న దిల్జిత్ తదుపరి కాన్సర్ట్‌కు కూడా అధికారులు ఇదే తరహా ముందస్తు ఆంక్షలు విధించడం గమనార్హం.