BREAKING
మైనస్ 7 డిగ్రీల గడ్డకట్టే చలిలో, వానలో సల్మాన్ ఖాన్ సాహసం టోంకిని పాదయాత్ర.. భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం - ఎస్ఐ వెంకటేష్ డీమ్యాట్ ఖాతా లేకుండానే కమర్షియల్ ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టే అవకాశం గ్లోబల్ టెక్ ఒడిదుడుకుల వేళ ఇన్వెస్టర్లకు భరోసా ఇస్తున్న భారత ఈక్విటీలు బ్యాటరీ స్క్రాప్ ఎగుమతులపై నిషేధం: దేశీయ శుద్ధి సామర్థ్యానికి అసలు సిసలు పరీక్ష! రికార్డు స్థాయికి చేరిన విదేశీ ఇన్వెస్టర్ల లాంగ్-షార్ట్ నిష్పత్తి: ‎భగవద్గీత జీవన వ్యక్తిత్వ వికాస గీత ‎ (ఆథ్యాత్మిక వ్యాసం) నేటి స్టాక్ మార్కెట్ హైలైట్స్: క్యూ2 ఫలితాలు, రూ. 215 కోట్ల పన్ను ఊరట నేపథ్యంలో ఫోకస్‌లో ఉండే టాప్ షేర్లు! క్రీడలతో మానసిక ఉల్లాసం స్వీడన్‌లో వీడిన రాజకీయ ప్రతిష్టంభన: షరతులతో కూడిన ప్రభుత్వ ఏర్పాటుకు సెంటర్ పార్టీ అంగీకారం! *పోలింగ్ స్టేషన్ నెం. 45/1, 45/2 లను తనిఖీ చేసిన కమిషనర్* రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న బాధితుడికి అర్ధరాత్రి పోలీసుల తక్షణ సహాయం స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ ఎన్విడియా నాయకత్వ మార్పులపై టెక్ వర్గాల్లో ఊహాగానాలు భారత్–ఈజిప్ట్ వాణిజ్య బంధంలో కీలక అడుగు

‎భగవద్గీత జీవన వ్యక్తిత్వ వికాస గీత ‎ (ఆథ్యాత్మిక వ్యాసం)

Select Suryaa Now
‎భగవద్గీత  జీవన వ్యక్తిత్వ వికాస గీత ‎  (ఆథ్యాత్మిక వ్యాసం)

‎భగవద్గీత  జీవన వ్యక్తిత్వ వికాస గీత
‎             (ఆథ్యాత్మిక వ్యాసం) 
‎ " కృష్ణం వందే జగద్గురుమ్" 
‎"శ్రీ రాధా రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః!!"
‎
‎వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ । దేవకీపరమానన్దం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతమ్ | వేదాబ్జభాస్కరం వన్డే శమాదినిలయం మునిమ్ ॥ శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయమ్ | నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్ || గురుర్ర్బహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవేనమః ॥
‎
‎అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా | చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ॥
‎
‎గీతా ధ్యానమ్
‎
‎పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ | అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అమ్బ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ॥
‎
‎నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర | యేన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ॥ ప్రపన్నపారిజాతాయ తోత్రవేత్రైకపాణయే । జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః ॥ సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనన్దనః । పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ||
‎
‎వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనమ్ దేవకీ పరమానందం 
‎
‎భగవద్గీత జీవన విలువల బంగారు పూత, హిందూ సంస్కృతీ సంపత్తుల ఊట. భక్తినీ, ముక్తినీ అందించే సాధనా మార్గం. భవరోగ పీడితుల పాలిట మహాఔషధం. అహం, మోహం, మమకారాలను దునుమాడే దివ్యసాధనం.
‎
‎వ్యక్తిత్వ వికాసాన్ని అందించే మహా విధానం భగవద్గీత. విస్తృత పరిధిలో మనందరిలో అణువణువునా వివేకాన్ని ఆవిష్కరింపజేసే వ్యక్తిత్వవికాస గీత భగవద్గీత. భగవద్గీతలో సంస్కృతీ, సంప్రదాయ, సనాతనత్వపు జ్ఞానం, ప్రజ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం ప్రతి పదంలోనూ ద్యోతకమవుతుంటాయి. భగవద్గీత అంటే ఏమిటో పేర్కొనడం ఒక్క మాటలో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. భగవద్గీత జీవితానికి శాంతిని, ప్రశాంతతను అందించే ఊరట. పరమాత్మ చూపే త్రోవ. జీవుడు భావించుకుంటునట్లుగా పరమాత్మునికి చేసుకొనే సేవ. వ్యావహారిక మార్గానికి అర్థాన్ని, పరమార్థాన్ని, పారమార్థిక తత్త్వాన్ని అందించే వరిష్ట భగవద్గీత. అమరత్వాన్ని, అమృతత్వాన్ని ఆవిష్కరింపజేసే బంధం భగవద్గీత. ఆత్మ సౌందర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పరిపుష్టం చేసే దిక్చూచి భగవద్గీత. బంధాలను, భవ బంధనాలను తగ్గించే మహోధృత తరంగాల వాడి భగవద్గీత. మానవాళి మొత్తానికి జీవనాడి భగవద్గీత. జీవన పథాన్ని, విధానాన్ని నిర్దేశించే మహావ్రాత భగవద్గీత. మన తలరాతను మార్చే మహామంత్రం. దివ్యత్వాల మానవత్వాల మధ్య మధ్యవర్తిత్వ ధూత భగవద్గీత. జీవితమనే యుద్ధంలో జయాలు, అపజయాలు,
‎స్వప్రయోజనం లేకపోయినా, ప్రాణులను కరుణించే కోరికతో శోకమోహాలనే మహాసముద్రంలో మునిగి ఉన్న అర్జునునికి వైదికమైన ధర్మద్వయాన్ని ఉపదేశించాడు, గుణాధికులైన వారిచేత గ్రహింపబడి అనుష్ఠింపబడిన ధర్మం ప్రచారమవుతుందని. భగవానుడు ఉపదేశించిన విధంగా ఆ ధర్మాన్ని సర్వజ్ఞుడైన వేదవ్యాసభగవానుడు గీత అనే పేరుతో ఏడువందల శ్లోకాలలో గ్రంథస్థం చేశాడు.
‎
‎పంచమవేదమైన మహాభారత మధ్యభాగంలో ప్రస్థాన త్రయాలలో ఒకటైన భగవద్గీత విరాజిల్లుతూ ఉంది. విశ్వవాఙ్మయంలో భగవద్గీతకున్న విశిష్ఠత మరే దేనికి లేదు. సమస్త వేదవేదాంతాల యొక్క సారం దీనిలో నిక్షిప్తమై ఉంది. దీనిపై ఎంతో మంది ఆచార్యులు భాష్యాలను, వ్యాఖ్యానాలనూ వ్రాసారు. ఆధ్యాత్మిక సాహిత్యంలో దేనికీ లేనంతగా దీనికి అనువాదాలు వెలువడ్డాయి. ఆధునిక కాలానికి తగ్గట్టు ఇప్పటికీ క్రొత్త క్రొత్త వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. శ్రీరామకృష్ణులు గీతను 'గీతా, గీతా' అంటూ పదిమార్లు ఉచ్ఛరిస్తే 'తాగీ తాగీ' అవుతుంది అని బోధించారు. భగవద్గీత త్యాగబోధనను ప్రతిపాదిస్తుంది. దృశ్యమాన ప్రపంచంలో ప్రతీ వస్తువు నశించిపోయేదన్న భావనతో త్యాగివి కమ్మంటుంది. క్షుద్రవిషయాల పట్ల ఆసక్తిని త్యజించమంటుంది. 'నేను, నాది' అన్న భావన విడనాడమంటుంది. సాధకుడికి సాధనా పథంలో తన అభిరుచికి తగ్గట్టు కర్మ, భక్తి, జ్ఞాన, రాజ యోగ మార్గాలను విపులంగా విశదీకరించిన ఆధ్యాత్మిక గ్రంథరాజం 'శ్రీమద్భవద్గీత'.
‎
‎
‎1) శ్లోకం::-"సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనన్దనః
‎         పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్.
‎
‎భావం::- ఉపనిషత్తులన్నియు ఆవులు; శ్రీకృష్ణమూర్తి పాలుపితుకువాడు; అర్జునుడు దూడ; మహత్తరమగు గీతామృతమే పాలు; సద్బుద్ధికలవాడే ఆ పాలను త్రాగువాడు.
‎
‎
‎2) శ్లోకం::- గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురమ్ నానాశాస్త్ర రహస్య శాఖ మరతి క్షాంతి ప్రవాలాంకితం కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినామ్.
‎
‎భావం::- “గీత యను కల్పవృక్షమును నేను సేవించుచున్నాను. అయ్యది భగవంతుడగు శ్రీకృష్ణపరమాత్మచే నాటబడినది. వేదవ్యాస మహర్షిచే పెంచబడినది. ఉపనిషత్తులే దాని విత్తనము. ఆత్మప్రబోధము దాని అంకురము. వివిధశాస్త్రములయొక్క రహస్యములు దాని కొమ్మలు. వైరాగ్యము, సహనము మున్నగు సద్గుణములు దాని చిగురుటాకులు. శ్రీకృష్ణపరమాత్మయొక్క పాదపద్మముల యెడల భక్తి దాని పుష్పసుగంధము. మఱియు నది జ్ఞానులకు మోక్షదాయకమైనది.”
‎
‎3) శ్లోకం::- "భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికాపీతా
‎సకృదపి యేన మురారి సమర్చా తస్య కరోతి యమోపి న చర్చామ్॥"
‎
‎భావం::- 'భగవద్గీతను ఒకింత అధ్యయనము చేసినను, గంగాజలమును కొద్దిగా త్రాగినను, విష్ణుభగవానుని ఒక్క పర్యాయము పూజించినను ఇఋ యముడు వాని చెంతకు పోనేరడు అని గీతయొక్క మహిమాతిశయమును మహానుభావులీప్రకారముగ చాటియున్నారు. 
‎
‎4) ్లోకం::- చేతోభృఙ్గ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయామ్ పిబపిబ గీతామకరన్దం యదుపతిముఖకమలభవాఢ్యమ్.
‎
‎మనస్సను ఓ తుమ్మెదా! రసహీనమగు ఈ సంసారమను మరుభూమియం దేల వ్యర్థముగ సంచరించుచున్నావు? (ఇక ఆ సంచారమును కట్టిపెట్టి) శ్రీ కృష్ణపరమాత్మయొక్క ముఖపద్మము నుండి బయలు వెడలిన శ్రేష్ఠమగు గీతామకరందమును పానము చేయుము!
‎
‎
‎
‎5) శ్లో॥ జాతాసి త్వం మురహరిముఖాజ్జాహ్నవీ తస్య పాదాత్ సర్వానభ్యుద్ధరతి భవతీ సాతు మగ్నాన్ విధత్తే 
‎ప్రత్యగ్ర్బహ్మామృతరసనిధిం ప్రాప్య విశ్రామ్యసి త్వం 
‎మాతర్గీతే జడనిధిమియం మాతి న త్వత్ప్రభావః.
‎
‎తా॥ ఓ గీతాదేవీ! విష్ణుభగవానుని పాదములనుండి గంగ ఉద్భవించినది. నీవో, ఆ భగవానుని ముఖమునుండి ఆవిర్భవించితివి! (ఓహో! ఎట్టి ఔత్కృష్ట్యము నీది!) మఱియు గంగయందు పడినవారి భౌతికదేహములు నీటిలో మునిగిపోవుచున్నవి. జ్ఞానగంగయగు నీయందు పడినవారి నందఱినో, నీవు ఉధ్ధరించుచున్నావు! ఇంతియే కాదు. గంగానది పోయి పోయి జడమగు ఉప్పు సముద్రమున (బంగాళాఖాతమున) కలిసిపోవుచున్నది. గీతాగంగయగు నీవో, చైతన్యమగు ప్రత్యగాత్మ యందు (బ్రహ్మానందసాగరమున) చేరి విశ్రమించుచున్నావు! ఇట్టి అనుపమ ప్రభావముగల గీతాగంగాతల్లీ! నిన్నిక దేనితో పోల్చగలము?
‎
‎
‎భగవంతు డెచటనుండునో అచట విజయము, ఐశ్వర్యము, నీతియుండును. ఇదియే గీతాసారము. 
‎గీత మొదటి శ్లోకములో గల ప్రశ్నకు చివరి శ్లోకము చక్కని సమాధాన రూపముగ నున్నది. 
‎అనగా
‎‘ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః 
‎మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ’
‎
‎అను ప్రశ్నకు
‎
‎"యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః 
‎తత్ర శ్రీర్విజయో భూతిర్రువానీతిర్మతిర్మమ"
‎
‎అను సమాధానము సమీచీనముగనున్నది. యుద్ధములో ఎవరు జయించిరి అని ధృతరాష్ట్రు డడుగ తుట్టతుదకు సంజయుడు 'ఎచ్చోట శ్రీకృష్ణపరమాత్మ యుండునో అచ్చోట విజయము సంభవించున'ని చెప్పెను. 
‎
‎భగవద్గీతలో 'జ్ఞానము, జ్ఞేయము' అను రెండు విషయములు ప్రధానముగా పేర్కొనబడినవి. అందు జ్ఞానము సాధన, జ్ఞేయము సాధ్యము. సాధ్యవస్తువును గూర్చి ఒకింత చెప్పి, సాధనను గూర్చి గీత విశేషించి పేర్కొనినది.
‎
‎జ్ఞానము ఎవనికి కలుగును? అను ప్రశ్నకు భగవానుడు గీతలో నిట్లు సమాధానమొసంగెను 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానం' శ్రద్ధావిశ్వాసములు గలవాడే జ్ఞానమును పొందగల్గును.
‎
‎"అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరస్తప
‎అప్రాప్య మాం నివర్తనే మృత్యుసంసారవర్త్మని"
‎
‎దైవమునందు, ధర్మమునందు విశ్వాసము లేనివారు, శ్రద్ధలేనివారు భగవంతుని పొందజాలక మృత్యురూప మగు సంసార సముద్రమున పడిపోవుదురని భావము. 
‎కావున దైవము కలడని, ధర్మము ఉద్ధరించునని పరిపూర్ణ విశ్వాసముతో అర్జునుని వలె గీతను శ్రవణము చేయవలెను. అపుడుమాత్రమే అర్జునునివలె మోహరహితుడు కాగల్గును. అట్లుగాక 'సంశయాత్మా వినశ్యతి' అనునట్లు వినాశమునే పొందును. నమ్మకముతో గీతోక్తసాధనలను ఆచరణయందుంచుకొనినచో ఫలితము కరతలామలకమై ప్రత్యక్షముగ ఆనందానుభూతి గలుగ గలదు.
‎
‎శ్లో::-యత్ర గీతావిచారశ్చ పఠనం పాఠనం శ్రుతమ్ 
‎తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవహి॥
‎
‎ఎచట గీతా శ్రవణము కాని, గీతా పఠనము కాని, గీతా తత్త్వవిచారణ కాని జరుగు చుండునో అచట తాను గూడ వచ్చియుందునని సాక్షాత్ విష్ణుభగవానుడు భూదేవికి వచించెను. కావున, ఏ గృహమున గీతాగానము జరుగు చుండునో, అ గృహము భగవంతునకు నిలయమై యొప్పుచుం డును. అనగా ఆ ఇల్లు దేవాలయముగ మారిపోవునని భావము. దైవము ప్రతిష్ఠింపబడని ఇల్లు ఇల్లుకాదు; నరక కూపము, దయ్యముల కొంప. కారాగృహము. కావున ఇంటింటియందును గీతావాణి ప్రతిధ్వనించ వలయును. అపుడే ఆ ఇల్లు, ఆ ఒళ్లు, ఆ ఊరు పవిత్రములై పోవును.
‎
‎భక్తులు అయిదు రకములు
‎1) శాంతభక్తుడు‌. 2) దాస్యభక్తుడు.
‎3) సఖ్యభక్తుడు 4) వాత్సల్యభక్తుడు
‎5) మాధుర్యభక్తుడు.
‎
‎అర్జునుడు శ్రీకృష్ణభగవానునితో సఖ్యసంబంధమును కలిగియుండెను. ఈ స్నేహమునకు మరియు భౌతికజగత్తు నందు గల స్నేహమునకు మధ్య గొప్ప భేదము గలదు. వారిది అలౌకిక స్నేహసంబంధము. అందరికీ అది సాధ్యము కాదు. వాస్తవమునకు, ప్రతియొక్కరు శ్రీకృష్ణునితో ఒక ప్రత్యేక సంబంధమును కలిగి యుందురు. భక్తియుక్తసేవ యందలి పరిపూర్ణత్వముచే అట్టి సంబంధము జాగృతము కాగలదు. కాని ప్రస్తుత మన జీవనస్థితిలో మనము భగవానుడినే కాకుండ, అతనితో గల మన శాశ్వత సంబంధమును కూడ విస్మరించితిమి. అనంతకోటి జీవరాశుల యందలి ప్రతిజీవి భగవానునితో ఏదో ఒక ప్రత్యేకమైన శాశ్వత సంబంధమును కలిగియుండును. అదియే 'స్వరూపము'గా పిలువబడును.
‎
‎ఈశ్వరుడు (భగవానుడు), జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ అనునవన్నియును భగవద్గీత యందు వివరింపబడినవి. ఈ ఐదింటిలో భగవానుడు, జీవులు, భౌతిక ప్రకృతి, కాలము అనునవి శాశ్వతములు. ప్రకృతి వ్యక్తస్థితి యందు తాత్కాలికము కావచ్చునేమో గాని మిథ్య కాదు. కొందరు తాత్త్వికులు భౌతిక సృష్టిని మిథ్య అని చెప్పుదురు. కాని భగవద్గీత సిద్ధాంతము ననుసరించి లేదా వైష్ణవుల సిద్ధాంతము ననుసరించి ఆ భావన సత్యము కాదు. భౌతిక జగత్తు ఎన్నడును మిథ్యగా అంగీకరింపబడక సత్యముగనే అంగీకరింప బడును. కాని అది తాత్కాలికమైనది.
‎
‎శ్రీకృష్ణభగవానుని ధామమైన భగవద్గీత(15. 6) నందు ఇట్లు వర్ణింపబడినది :
‎""న తద్భాసయతే సూర్యో న శశాజ్కో న పావకః 
‎యద్గత్వా న నివర్తస్తే తద్ధామ పరమం మమ""
‎“అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని లేదా అగ్ని విద్యుత్తులచే గాని ప్రకాశింప జేయబడదు. దానిని చేరినవారు ఈ భౌతిక జగత్తునకు తిరిగి రారు.”
‎ఈ శ్లోకము ఆధ్యాత్మికాకాశమును వర్ణిస్తున్నది.
‎
‎శ్లోకం ::-"గీతాశాస్త్ర మిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ 
‎విష్ణోః పదమవాప్నోతి భయశోకాది వర్జితః".
‎
‎భావం::- పరమ పావనమగు ఈ గీతాశాస్త్రమును ఎవడు ప్రయత్నపూర్వకముగ పఠించునో, అట్టివాడు భయ శోకాది రహితమగు విష్ణుపదమును బొందును.
‎
‎
‎శ్లోకం::- యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః 
‎             తత్ర శ్రీర్విజయో భూతిర్రువా నీతిర్మతిర్మమ.
‎భావం::-ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణమూర్తియు, ఎచట ధనుర్ధారియగు అర్జునుడును ఉందురో, అచ్చోట లక్ష్మి, విజయము, ఐశ్వర్యము, నీతి తప్పక ఉండునని నా నిశ్చయము.
‎
‎గీతా మే చోత్తమం గృహమ్'- అని భగవద్వాక్యము. అనగా 'నేను గీత నాశ్రయించుకొని యున్నాను. గీత నాయొక్క నివాసగృహమ'ని భావము. ఈ ప్రకారముగ గీతామాహాత్మ్యము గీతాగృహమునుగూర్చి భగవానుడు తెలిపియున్నాడు. ఆ గృహముయొక్క స్వరూప, స్వభావముల వివరము ఈ క్రింది తెలుపబడుచున్నది.
‎
‎గీతాసౌధ వివరములు
‎
‎నిర్మాత ::- శ్రీకృష్ణపరమాత్మ
‎అలంకరణకర్త ::- శ్రీ వేదవ్యాస మునీంద్రులు
‎ఆకారము ::- మూడంతస్తులు గలది.
‎పునాది ::- అర్జున విషాదయోగము (ప్రథమాధ్యాయము)
‎మొదటి అంతస్తు ::- కర్మషట్కము
‎5 గదులు (2వ అధ్యాయమునుండి 6వ అధ్యాయము వఱకు) (సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మసన్న్యాసయోగము, ఆత్మసంయమ యోగము అనునవి.)
‎రెండవ అంతస్తు ::- 6 గదులు (భక్తిషట్కము - (7వ అధ్యాయము నుండి 12వ అధ్యాయము వరకు) విజ్ఞాన యోగము, అక్షర పర బ్రహ్మ యోగము, రాజ విద్యా రాజ గుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తియోగము అనునవి.)
‎మూడవ అంతస్తు ::- 6 గదులు (జ్ఞానషట్కము (13వ అధ్యాయము నుండి 18వ అధ్యాయము వఱకు) క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము, గుణత్రయవిభాగయోగము, పురుషోత్తమ ప్రాప్తియోగము, దైవాసురసంపద్విభాగయోగము, శ్రద్ధాత్రయవిభాగయోగము, మోక్షసన్న్యాసయోగము అనునవి.)
‎నిర్మాణమునకు వలసిన సున్నము :: - కర్మ
‎నీళ్ళు ::- భక్తి
‎ఇటుక ::- జ్ఞానము.
‎
‎గీతాభవనము అతివిశాలమైనది. అతిసుందరమైనది. అందలి ఒక్కొక్క గది యందు చిత్రవిచిత్రములైన అమూల్యపదార్ధములు ఉంచబడినవి. ఆ భవనమునందు ఎవరైనను ప్రవేశించవచ్చును. జాతి మత కుల లింగ వివక్షత లేదు. ప్రవేశరుసుము లేదు. అట్లు ప్రవేశించి ఆ యా వస్తువులను నిరాటంకముగ దర్శించవచ్చును, స్పర్శించవచ్చును, ఎత్తుకొని ఇంటికి వెళ్ళవచ్చును. అడ్డుపెట్టువారులేరు. ఆటంకపరచువారుండరు. ఒకపుడు శంకరాచార్యులు ఆ గీతాభవనములోనికేగి దాని సౌందర్యమును చూచి ముగ్ధులై తనయిచ్చవచ్చిన పదార్థముల నటనుండి గ్రహించివెళ్ళిరి. తదుపరి రామానుజాచార్యులు వచ్చిరి. మధ్వాచార్యులు వచ్చిరి. 
‎అట్లే అనేకులు వచ్చి గీతాభవనమును సందర్శించి, 
‎అందలి వసువులను స్వీకరించి వెడలి పరమ శాంతిని బడసిరి. కాని విచిత్రమేమనగా, ఎవరు ఎన్ని వస్తువులను పట్టుకొని వెళ్ళినను, తిరిగి ఆ భవనము సమస్తపదార్ధములచే పరిపూర్ణమై అక్షయముగ దనరుచున్నది. ఇదియే గీతాభవనము యొక్క విశిష్టత. కావున ముముక్షువులెల్లరు ఈ గీతానామక మహోత్తుంగ సువిశాల భవ్య భవనంబును కనులపండువుగ వీక్షించి, అందు బహుకాలము విశ్రాంతిగొని, సేదతీర్చుకొని, సంసారిక దుఃఖజాలమునుండి విముక్తులె పరమానంద మనుభవించి ధన్యులయ్యెదరుగాక!..
‎
‎ధర్మ మార్గాన పయనించండి
‎ఆథ్యాత్మిక బలసంపన్నులై జీవించండి
‎సనాతన సాంప్రదాయ విలువలై మెలగండి
‎
‎శుభమస్తు...విజయోస్తు 
‎రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
‎సెల్ ::--8247433432
‎
‎
‎
‎
‎
‎
‎
‎