పమిడిపాడు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పమిడిపాడు గ్రామ సమీపంలో, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో ఆత్మకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సదరు వ్యక్తి యొక్క పేరు, చిరునామా మరియు ఇతర వివరాలు తెలియకపోవడంతో, సంబంధిత గ్రామ వీఆర్వో ద్వారా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 111/2026 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది. మృతుడి శారీరక ఆనవాళ్లు మరియు ధరించిన దుస్తుల వివరాలు తెలిపారు. సుమారు 50 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు గల పురుషుడి మృతదేహం శరీర ఛాయ నలుపు రంగులో ఉందని, తలపై నల్లటి జుట్టు కలిగి ఉన్నాడని,ముఖంపై గుబురుగా పెరిగిన నల్లటి గడ్డం మరియు మీసాలు ఉన్నాయని, మృతుడు నీలం రంగు చొక్కా ధరించి ఉన్నాడని,చూడటానికి యాచకుడిగా లేదా నిరాశ్రయ వ్యక్తిగా జీవిస్తున్నట్లు కనిపిస్తున్నాడని, ప్రాథమిక పరిశీలనలో మృతుడి శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు.ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే, లేదా సదరు వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు లేదా తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవలసిందిగా కోరారు.ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సెల్ నంబర్: 9440796390కు తెలపాలని, గుర్తుతెలియని మృతుడి ఆచూకీ గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రజలు సహకరించవలసిందిగా ఆత్మకూరు పోలీసులు విజ్ఞప్తి చేశారు.