పదవులు అనుభవించి.. పార్టీ కష్టకాలంలో ఫిరాయింపులా
. మాజీ ఎంపీపీ మెరుగు రాజేశ్వరి, ఆమె భర్త అప్పారావుపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆగ్రహం
ఐదేళ్ల పాటు ఎంపీపీగా అవకాశం కల్పించిన పార్టీకి కష్టకాలంలో వెన్నుపోటు పొడిచారంటూ విమర్శలు
సంతబొమ్మాళి, నవంబర్ 29, మేజర్ న్యూస్ :వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఐదేళ్ల పాటు మండల పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) పదవిని అనుభవించి, పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో చేరి ప్రచారం చేయడంపై మాజీ ఎంపీపీ మెరుగు రాజేశ్వరి, ఆమె భర్త అప్పారావుపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు పార్టీ అండతో పదవులు, రాజకీయ అవకాశాలు పొందిన వారు.. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉండగా పక్క పార్టీలో చేరి తమ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మెరుగు రాజేశ్వరికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు ఎంపీపీగా పనిచేసే అవకాశం కల్పించారని ఆ పార్టీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. పార్టీ ప్రాధాన్యతనిచ్చి పదవిని కట్టబెట్టినప్పుడు లబ్ధి పొందిన వారు, ఇప్పుడు పార్టీకి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన సమయంలో అండగా నిలవాల్సింది పోయి టీడీపీలో చేరి ప్రచారం చేయడం కార్యకర్తలను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోందని అంటున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి, ఆ వర్గం సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అవకాశాలు పొందిన వారు.. ఇప్పుడు పెండింగ్ బిల్లులు, ఇతర రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ మారారంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, ఇప్పుడు అదే పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం రాజకీయ విలువలకు విరుద్ధమని మండిపడుతున్నారు.పదవులు, అధికారాలు ఉన్నప్పుడు పార్టీతో కలిసి ఉండి.. కష్టకాలంలో మాత్రం దూరమవుతున్న నాయకుల వైఖరిపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మనోభావాలను నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.