పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు
గోకవరం, మేజర్ న్యూస్ :విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని, 25 వసంతాలు–సేవా సంకల్ప అభియాన్, వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా గోకవరం దాసరి చిన్న ధర్మ రాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంబాల శ్రీనివాసరావు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు ప్రధానం చేశారు. సీనియర్ విభాగంలో మొదటి విజేతకు రూ. 5 వేలు, రెండో విజేతకు రూ.3 వేలు, మూడో విజేతకు రూ. 2 వేలు, నాలుగో విజేతకు 1,000 రూపాయలు, అలాగే జూనియర్ విభాగంలో మొదటి విజేతకు రూ. 5 వేలు, రెండో విజేతకు రూ 3 వేలు, మూడో విజేతకు రూ. 2 వేలు, నాలుగో విజేతకు 1,000 రూపాయలు నగదును అందజేశారు.
అలాగే పాఠశాల ఉపాధ్యాయులను కంబాల శ్రీనివాసరావు ఘనంగా సత్కరించి, మహిళా ఉపాధ్యాయులకు పట్టు చీరలు పంపిణీ చేసి, మెమొంటోలు ప్రధానం చేశారు. అలాగే కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది కంబాల శ్రీనివాసరావును పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఆయన ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి కొనియాడారు.
ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తానన్నారు.విద్యార్థులలో చిన్ననాటి నుంచే సృజనాత్మకతను ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.