ఓటీ, ఐసీయూ దుస్తులతో బయట తిరిగితే చర్యలు
ఇన్ఫెక్షన్ల నియంత్రణకు డీఎంఈ ఆదేశాలు నిబంధనల ఉల్లంఘనపై క్రమశిక్షణ చర్యలు
ఆసుపత్రి సిబ్బందికి సూపరింటెండెంట్ హెచ్చరిక
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ థియేటర్లు (ఓటీ), అత్యవసర చికిత్స విభాగాలు (ఐసీయూ) తదితర కీలక విభాగాల్లో విధులు నిర్వహించే వైద్యులు, పీజీ విద్యార్థులు, ఇంటర్న్‌లు, నర్సింగ్ సిబ్బంది ప్రత్యేక దుస్తులను నిర్దేశిత ప్రాంతాలకే పరిమితం చేయాలని స్పష్టం చేశారు. విధులు ముగిసిన అనంతరం అదే దుస్తులతో సాధారణ వార్డులు, ఓపీడీలు, కారిడార్లు, కార్యాలయాలు, క్యాంటీన్లు, ఆసుపత్రి ప్రాంగణాల్లో తిరగరాదని ఆదేశించారు. ఈ నిబంధనలను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. మాణిక్యాలరావు తెలిపారు. ప్రత్యేక దుస్తులతో ఇతర ప్రాంతాల్లో సంచరించడం వల్ల సూక్ష్మజీవులు వ్యాపించి రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటివరకు మౌఖికంగా అమలవుతున్న ఈ నిబంధనలకు తొలిసారిగా లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు.
నిర్దేశిత ప్రాంతాల్లోనే ప్రత్యేక దుస్తులు
ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, ప్రసవ గదులు, క్యాథ్ ల్యాబ్‌లు, మార్పిడి చికిత్స విభాగాలు, సీసీఎస్‌డీ స్టెరైల్ జోన్‌లలో మాత్రమే ప్రత్యేక దుస్తులు ధరించాలి. ఆయా విభాగాల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రత్యేక దుస్తులు, టోపీలు, మాస్కులు, షూ కవర్లను తొలగించాలి. ఓటీ, ఐసీయూలకు కేటాయించిన ప్రత్యేక పాదరక్షలను ఇతర ప్రాంతాల్లో ఉపయోగించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ప్రత్యేక దుస్తులపై శుభ్రమైన గౌన్ లేదా కోటు ధరించాలి. తిరిగి లోపలికి ప్రవేశించే సమయంలో కొత్త ప్రత్యేక దుస్తులు ధరించాలి.
లాండ్రీలో శుభ్రం.. ఆకస్మిక తనిఖీలు
ఓటీ, ఐసీయూలకు అవసరమైన సంఖ్యలో ప్రత్యేక దుస్తులను అందుబాటులో ఉంచాలి. రెండు విభాగాలకు వేర్వేరు రంగుల దుస్తులు కేటాయించాలి. ఉపయోగించిన దుస్తులను ఆసుపత్రి లాండ్రీలోనే శుభ్రం చేయించాలి. ప్రతి ఓటీ, ఐసీయూ ప్రవేశద్వారం వద్ద పురుషులు, మహిళలకు వేర్వేరుగా దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలి. నిబంధనల అమలును ఇన్ఫెక్షన్ నియంత్రణ కమిటీ ఆకస్మిక తనిఖీల ద్వారా పర్యవేక్షిస్తుంది. తొలిసారి ఉల్లంఘించిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి నమోదు చేస్తారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రిన్సిపాల్ లేదా సూపరింటెండెంట్‌కు నివేదించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డాక్టర్ మాణిక్యాలరావు హెచ్చరించారు. రోగుల భద్రత, ఇన్ఫెక్షన్ల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యతని, వైద్యులు, విద్యార్థులు, నర్సింగ్, ఇతర సిబ్బంది నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.