ఓటరు స్లిప్పుల పంపిణీలో లోపాలా..? తుఫాను ప్రభావమా..?
ఓటు ఎక్కడ వేయాలో తెలియక అయోమయంలో కొందరు ఓటర్లు..
కడియం, మేజర్ న్యూస్,:కడియం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఆశించిన స్థాయిలో సాగలేదు. మొత్తం 62,081 మంది ఓటర్లకు గాను 44,436 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మండలంలో 71.57 శాతం పోలింగ్ నమోదైంది. వీరిలో 22,309 మంది పురుషులు, 22,117 మంది మహిళలు ఉన్నారు. మిగిలిన 17,645 మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. పోలింగ్ శాతం తగ్గడానికి గల కారణాలపై ప్రస్తుతం రాజకీయ, ప్రజావర్గాల్లో చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఈసారి ఓటరు స్లిప్పుల పంపిణీలో జరిగిన జాప్యం, సమన్వయ లోపాలు ఓటర్లను ఇబ్బందులకు గురిచేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు స్లిప్పులు అందించేవారు. అయితే ఈసారి ఎన్నికల విధుల్లో సిబ్బంది నిమగ్నం కావడం, స్లిప్పుల పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో కొంతమంది ఓటర్లకు అవి అందలేదు. దీంతో తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలియక పలువురు అయోమయానికి గురైనట్లు తెలుస్తోంది.
మరోవైపు గత పది రోజులుగా వరుస తుఫాన్లు, భారీ వర్షాలు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు కూడా పోలింగ్‌పై ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ సక్రమంగా జరిగి, వాతావరణం అనుకూలించి ఉంటే పోలింగ్ శాతం మరింత పెరిగేదన్న చర్చ స్థానికంగా సాగుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదే అయినప్పటికీ, ఈసారి కడియం మండలంలో నమోదైన 71.57 శాతం పోలింగ్ పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఓటింగ్ తగ్గడానికి అసలు కారణాలపై అధికార యంత్రాంగం సమీక్షించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.