భూగర్భ జలాల పెంపునకు గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు
సదాశివపేట;వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మిలిగిరిపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమం ప్రారంభించారు.బుధవారం గ్రామ సర్పంచ్ షాబుద్దీన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, ప్రభుత్వ పాఠశాల ఆవరణ, గ్రామ పంచాయతీ కార్యాలయం, బోరుబావుల సమీపంలో, వర్షపు నీరు వృథాగా ప్రవహించే ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ షాబుద్దీన్ మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడం ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద, ప్రతి వీధిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నీటి వృథాను అరికట్టి, భవిష్యత్ తరాలకు నీటి వనరులను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.