నూతన పరిశోధనలు,ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలి
- మిట్స్‌లో లాంఛనంగా ఎం.టెక్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం
మదనపల్లె : మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026-27 విద్యాసంవత్సరానికి ఎం.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమాన్ని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్,డైరెక్టర్-అడ్మిషన్స్ డాక్టర్ దీపాంకర్ రాయ్,డీన్-స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా మరియు విభాగాధిపతులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానంలో చోటుచేసుకుంటున్న నూతన మార్పులు,ఆధునిక ఆవిష్కరణలు,పరిశోధనా రంగంలో జరుగుతున్న అభివృద్ధిపై విద్యార్థులు నిరంతరం అవగాహన పెంపొందించుకోవాలన్నారు.ఎం.టెక్ విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశోధన,ఆవిష్కరణలు,పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు.విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను అధ్యాపకులతో పంచుకొని వాటిని పరిశోధనా ప్రాజెక్టులు,నూతన ఆవిష్కరణలుగా మలుచుకోవాలన్నారు.వివిధ విభాగాల విద్యార్థులు,అధ్యాపకులతో కలిసి మల్టీడిసిప్లినరీ పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని తెలిపారు.యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న ఆధునిక ప్రయోగశాలలు,పరిశోధనా సౌకర్యాలు,మౌలిక వసతులు,గ్రంథాలయం తదితర వనరులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.విద్యార్థులు కేవలం ఉద్యోగం పొందడమే లక్ష్యంగా కాకుండా,నూతన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చే స్థాయికి ఎదగాలని,ఉన్నత విద్య,పరిశోధన,పరిశ్రమలు,స్టార్టప్ రంగాల్లో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత విభాగాధిపతులు డాక్టర్ ఎమ్.శ్రీదేవి,డాక్టర్ ఎస్.పద్మ,అధ్యాపకులు మరియు ఎం.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.