నోబుల్ అరెస్టుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అగ్రహం -- తక్షణమే నోబుల్ ని విడుదల చేయాలని నాయకుల డిమాండ్
కైకలూరు, మేజర్ న్యూస్, విజయవాడ లో ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని ప్రశ్నిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో రాజ్‌భవన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విజయవాడ వెళ్లిన కైకలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ ని పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం భావప్రకటనా స్వేచ్ఛను, నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కును హరించడమేనని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించే గొంతుకలను పోలీసుల ద్వారా అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి ఎంపీలు ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని బలప్రయోగానికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు నాయకులు, ఎంపీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ఆందోళనను కొనసాగిస్తోంది. ఛలో రాజ్‌భవన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన బొడ్డు నోబుల్ ని విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రశ్నిస్తే అరెస్టులా? నిరసిస్తే నిర్బంధమా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం ద్వారా ప్రజల గొంతును మూయలేరని కాంగ్రెస్ శ్రేణులు స్పష్టం చేశాయి. బొడ్డు నోబుల్ అరెస్ట్, నిర్బంధానికి సంబంధించి పోలీసులు స్పష్టత ఇవ్వాలని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని, అరెస్టులు, నిర్బంధాలతో తమ ఉద్యమాన్ని ఆపలేరని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించాయి.
రిపోర్టర్ ఎం రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా,