నెల్లిమర్ల ఎంపీపీ పీఠం కూటమి కైవసం
- ఒక్క ఓటు తేడాతో ఎంపీపీగా సువ్వాడ వనజాక్షి విజయం
- వైస్ ఎంపీపీగా జనసేన అభ్యర్థి మజ్జి రామారావు ఎన్నిక
నెల్లిమర్ల, సూర్య: నెల్లిమర్ల మండల ప్రజా పరిషత్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఒక్క ఓటు ఆధిక్యంతో కూటమి అభ్యర్థి సువ్వాడ వనజాక్షి ఎంపీపీగా, సారిపల్లి ఎంపీటీసీ మజ్జి రామారావు (జనసేన) వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) మురళీ మోహన్ ఆధ్వర్యంలో చేతులెత్తే పద్ధతిన ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. మండలంలోని మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు గాను ఇరువర్గాల మధ్య గట్టి పోటీ నెలకొంది. కూటమి అభ్యర్థి సువ్వాడ వనజాక్షికి టీడీపీ నుంచి 5 గురు, జనసేన నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర అభ్యర్థి కలిపి మొత్తం 8 మంది ఎంపీటీసీలు మద్దతు తెలిపారు. వైసీపీ తరఫున పోటీ చేసిన కొండవెలగాడ ఎంపీటీసీ గదల బంగారమ్మకు 7 గురు సభ్యులు మద్దతు ఇచ్చారు. దీంతో 8-7 ఓట్ల తేడాతో సువ్వాడ వనజాక్షి విజయం సాధించారు. వైస్ ఎంపీపీ గా కూటమి తరఫున బరిలో నిలిచిన సారిపల్లి జనసేన ఎంపీటీసీ మజ్జి రామారావుకు 8 మంది మద్దతు లభించగా, వైసీపీ అభ్యర్థి, గుషిణి ఎంపీటీసీ చనమల్లు తులసిరామ్ కి 7 గురు మద్దతు తెలిపారు. దీంతో మజ్జి రామారావు వైస్ ఎంపీపీగా ఎన్నికైనట్లు ఆర్ఓ ప్రకటించారు. ఈ ఎన్నికకు ఎక్స అఫిసియో సభ్యులుగా ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు హాజరయ్యారు. - కోఆప్టెడ్ ఎన్నిక వాయిదా
గురువారం జరగాల్సిన కోఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ ఎన్నిక నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనుంది.
- మిన్నంటిన సంబరాలు
కూటమి అభ్యర్థుల విజయంతో ఎంపీడీఓ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నూతన ఎంపీపీ సువ్వాడ వనజాక్షి, వైస్ ఎంపీపీ మజ్జి రామారావులకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.