ఎంపీపీగా దన్నాన పద్మావతి
చీపురుపల్లి, సూర్య: చీపురుపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలిగా కరకాం ఎంపీటీసీ గా గెలిచిన దన్నాన పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఎస్ తవిటి నాయుడు ఎంపీపీ ఎన్నిక ప్రత్యేక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి 12 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు, ఇద్దరు జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. పట్టణంలోని 4వ వార్డు ఎంపీటీసీ గవిడి నాగరాజు ఎంపీపీ గా దన్నాన పద్మావతి పేరు ప్రతిపాదించగా మరో ఎంపీటీసీ చందక దుర్గాభవాని బలపరిచడంతో మిగిలిన సభ్యులు వారి అంగీకారాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడంతో ఎంపీపీ గా దన్నాన పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారికంగా మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని ఎన్నికల అధికారులు చేతులమీదుగా ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, ఎంపీడీవో ఐ సురేష్, టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కాము నాయుడు, దన్నాన రామచంద్రుడు, ఎంపీటీసీ సభ్యులు వెంపడాపు హైమావతి, రేగాన శాంతి ప్రియ, శనపతి నవ్య, ఇజ్జిరోతు నిహారిక, రెడ్డి శాంతమ్మ, వెంపడాపు రాజేశ్వరి, సప్ప లక్ష్మి, కోట్ల కృష్ణ, పొన్నాడ మహేశ్వరరావు, బైరెడ్డి మణికంఠ పాల్గొన్నారు.