గజపతినగరం ఎంపీపీగా గంట్యాడ శ్రీదేవి ప్రమాణ స్వీకారం
గజపతినగరం, సూర్య: గజపతినగరం మండలంలో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్షురాలిగా గంట్యాడ శ్రీదేవి ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొంది. మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా తరలివచ్చారు.కార్యాలయానికి చేరుకున్న శ్రీదేవికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, బాణాసంచా మోతల మధ్య ఆమె వేదికపైకి చేరుకున్నారు. అధికారుల సమక్షంలో రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగింది.
కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గార తవుడు ప్రత్యేకంగా పాల్గొని శ్రీదేవిని అభినందించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గజపతినగరం మండలానికి సమర్థవంతమైన నాయకత్వం లభించింది. నేను జెడ్పీటీసీ గా ఉన్నప్పుడు మండల అభివృద్ధి కోసం ఎలా కృషి చేశానో అందరికీ తెలుసు. అదే స్ఫూర్తితో శ్రీదేవి పనిచేస్తారని పూర్తి నమ్మకం ఉంది. మండలంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నీ ఆమె హయాంలో పూర్తవుతాయి. ఆమెకు నా పూర్తి మద్దతు, సహకారం ఎప్పుడూ ఉంటుంది.అని అన్నారు.ప్రమాణ స్వీకారం అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కి మాజీ జెడ్పీటీసీ గార తవుడుకి, మండల ప్రజలకు ధన్యవాదాలు. నా ప్రాధాన్యతలు స్పష్టం
. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు
. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగు
. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి
. మహిళా స్వయం సహాయక సంఘాలకు బలం
. రైతుల సమస్యల పరిష్కారం
అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతి రూపాయి నిధిని ప్రజల కోసమే ఖర్చు చేస్తాను. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాను అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ గోపాల్ రాజు, గుంట్రోతు గోవిందా ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల పెద్దలు పాల్గొన్నారు. శ్రీదేవికి పూలదండలు వేసి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.