ఘనంగా ఏకాహోమ పూజలు - భక్తి పారవశ్యంలో పలాస.
కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా 24 గంటల జాగరణ, భజనలు.
హోమాలతో మార్మోగిన ఆలయాలు.
పలాస, నవంబర్ 20,మేజర్ న్యూస్.
పలాస మండలం, మున్సిపాలిటీ పరిధిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఏకాహోమ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలు, భజనలతో పలాస పట్టణం మొత్తం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు.
పలాస శ్రీ మదనమోహన స్వామి ఆలయం,కాశీబుగ్గ శ్రీ బృందావనచంద్ర రాధాకాంత ఆలయాలతో పాటు పొందర, కండ్ర వీధుల్లోని ఆలయాల్లో ఏకాహోమమును శాస్త్రోక్తంగా జరిపారు.అర్చకులు వేద మంత్రాలతో హోమాన్ని ప్రారంభించగా, భక్తులు భక్తి భావంతో పాల్గొన్నారు. హోమగుండం నుంచి వెలువడిన పవిత్ర ధూపం, నెయ్యి సువాసనతో ఆలయ ప్రాంగణం మొత్తం దైవీక వాతావరణం నెలకొంది.
8 సార్లు హోమం - 24 గంటల జాగరణ.
మూడు గంటలకు ఒకసారి చొప్పున హోమాన్ని జపిస్తూ మొత్తం ఎనిమిది సార్లు హోమము నిర్వహించారు. ఏకాదశి ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు రాత్రంతా నిద్రను విడిచి 24 గంటల పాటు జాగరణ చేశారు.జాగరణలో భాగంగా భజన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, యువకులు, వృద్ధులు అందరూ కలిసి హరినామ సంకీర్తనలు చేస్తూ, కోలాటాలు, భజనలతో ఆలయాలను మార్మోగించారు. చిన్న పిల్లలు కూడా భక్తి పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా రాత్రి ఆలయాల్లో జాగరణ చేసిన భక్తులకు నిర్వాహకులు అల్పాహారము, టీ, తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించారు. వృద్ధులు, మహిళలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఏకాదశి విశిష్టత.
కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండి, జాగరణ చేసి, హోమాలు, భజనలు చేస్తే సకల పాపాలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.అందుకే ఏటా ఈ ఏకాదశి వేడుకలకు పలాసలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. చివరిలో అందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.