కోటబొమ్మాళి జడ్పీటీసీగా పూజారి శైలజ ప్రమాణస్వీకారం
కోటబొమ్మాళి, నవంబర్ 20, మేజర్ న్యూస్: కోటబొమ్మాళి మండల నూతన జడ్పీటీసీగా హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన పూజారి శైలజ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూజారి శైలజ మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరువ చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆమెకు అభినందనలు తెలిపారు.