పుస్తక పఠనంతో మానసిక వికాసం -భవిష్యత్తు నిర్మాణంలో గ్రంథాలయాలది కీలక పాత్ర -గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో డీఈఓ శివకుమార్
ఎడ్యుకేషనల్ స్టాఫ్ రిపోర్టర్ : పుస్తక పఠనం మానసిక వికాసానికి దోహదపడటంతో పాటు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుందని టిటిడి డీఈఓ డా.ఏవీఎన్ శివకుమార్ పేర్కొన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు శుక్రవారం టిటిడి శ్వేత భవనంలోని శ్రీవెంగమాంబ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ నిరంతర పఠనం ద్వారా మెదడు చురుకుదనం పెరుగుతుందని, కొత్త పదాలు, విషయాలను నేర్చుకోవడం వల్ల మెదడులోని నాడీకణాలు ఉత్తేజితమవుతాయని తెలిపారు. పుస్తక పఠనం వల్ల వయసు పెరిగే కొద్దీ ఎదురయ్యే మతిమరుపు సమస్యలను నివారించడంలో కూడా తోడ్పాటు లభిస్తుందన్నారు. టిటిడి ఈఓ ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు టిటిడి గ్రంథాలయాలను విద్యార్థులకు మరింత చేరువ చేయడంతో పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి గ్రంథాలయాల ఆధునీకరణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
వివేకానందించే జ్ఞాన భాండాగారం
ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ డా.వేమా వేంకటరత్నం మాట్లాడుతూ గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కాకుండా సమాచారం, విజ్ఞానం, వివేకాన్ని అందించే జ్ఞాన భాండాగారాలని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ కొంత సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలని సూచించారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా జీవిత చరిత్రలు, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రం వంటి విభిన్న అంశాలకు సంబంధించిన పుస్తకాలను చదవాలని పిలుపునిచ్చారు.
ప్రశంసా పత్రాలు, పుస్తక ప్రసాదం అందజేత
అనంతరం ‘గ్రంథాలయం–జీవితానికి మార్గదర్శకం’ అనే అంశంపై తెలుగు, ఆంగ్ల భాషల్లో నిర్వహించిన వ్యాసరచన, సనాతన ధర్మంపై క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, పంచగవ్య గిఫ్ట్ ప్యాకెట్లు, అగరబత్తీల ప్యాకెట్లు, ఐదు రకాల పుస్తక ప్రసాదాన్ని అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రం, పుస్తక ప్రసాదం అందించారు. టిటిడి లైబ్రరీ ఇన్‌ఛార్జి డా.బాలాజీ దీక్షితులు ఎస్వీ యూనివర్సిటీ ఓఆర్ఐ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.టి.రాజశేఖర్, ఐటీ జీఎం సందీప్, శ్వేత ఏఈఓ అరుణదేవి, సూపరింటెండెంట్ సుశీల, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్