మండల అభివృద్ధే నా లక్ష్యం.
- ప్రమాణస్వీకారం చేసిన జడ్పీటీసీ పల్లేల నాగేశ్వరరావు.
మండల ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
అనకాపల్లి, నవంబర్ 20, మేజర్ న్యూస్: అనకాపల్లి మండల ప్రజల ఆశీర్వాదంతో, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల అండదండలతో జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన కుంచంగి గ్రామానికి చెందిన పల్లేల నాగేశ్వరరావు శుక్రవారం అనకాపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి నాగేశ్వరరావును అభినందించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పల్లేల నాగేశ్వరరావు మాట్లాడుతూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన మండల ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తన విజయానికి కృషి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని, మండల అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ నిధులను పారదర్శకంగా, మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి పనులకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని ప్రతి గ్రామంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ముఖ్యంగా వెనుకబడిన గ్రామాలను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని అన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. స్థానిక ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సహాయ సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, వారి మార్గదర్శకత్వంలో మండలంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. తనకు అండగా నిలిచిన కుంచంగి గ్రామ ప్రజలకు, మండలంలోని ప్రతి గ్రామ ప్రజలకు, తన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో అనకాపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు