నీలమణి దుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ.
మెలియాపుట్టి. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఉత్కలాంధ్ర ఇలవేల్పుగా విరాజిల్లుతున్న పాతపట్నం శ్రీ నీలమణి దుర్గమ్మను పాతపట్నం ఎమ్మెల్యే, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు మామిడి గోవిందరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఆయన కుమారుడు డాక్టర్ మామిడి సాయిగణేష్, కోడలు డాక్టర్ దుర్గావైష్ణవి దంపతులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.
దసరా నవరాత్రుల సందర్భంగా ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నీలమణి దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు,కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.