నాయుడు చుట్టూ నర్సాపురం రాజకీయం !
నరసాపురం, మేజర్ న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతి రాజా రామ్మోహన్ నాయుడు చుట్టూ తెలుగుదేశం, కూటమి పార్టీల రాజకీయం తిరుగుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. 2024 సాధారణ ఎన్నికలలో నాయుడు కీలక పాత్ర పోషించారు. కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన బొమ్మిడి నాయకర్ గెలుపునకు విశేష కృషి చేశారు. అందరి సహకారంతో సుమారు 50 వేల మెజార్టీతో నాయకర్ గెలుపొందారు. అనంతరం అమెరికాలో వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ నరసాపురం వచ్చి వెళ్తున్నారు. గత వారం రోజుల క్రితం నాయుడు తిరిగి నరసాపురం విచ్చేశారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని పార్టీలు సుముఖంగా ఉన్నాయి. మున్సిపల్, జడ్పిటిసి, ఎంపీటీసీ, గ్రామ సర్పంచుల పదవీకాలం ముగియటంతో ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి కీలకంగా వ్యవహరించే నాయుడు స్థానికంగా ఉండటంతో ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎన్నికల భారాన్ని నాయుడు పై వేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా శాసన మండలి మాజీ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ ఇప్పటికే నాయుడు నివాసంలో సుమారు రెండు గంటలపాటు ఏకాంతంగా చర్చించారు. అనంతరం ఎంఏ షరీఫ్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, నాయుడుతో కలిసి మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులు పై సుదీర్ఘంగా చర్చించారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చైర్మన్ పదవి లభిస్తే ఎవరిని పోటీలో దింపాలి అనే విషయమై టికెట్ ఆశించే అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్, పంచాయతీ, ఎంపిటిసి ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపించే అభ్యర్థులు నాయుడు నివాసం చుట్టూ క్యూ కడుతున్నారు. మీ ఆశీస్సులు ఉంటే కచ్చితంగా గెలుస్తామని నాయుడు హామీ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, నారా లోకేష్ నాయుడును తన నివాసానికి పిలిపించి స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అవలంబించవలసిన వ్యూహం, గెలుపు అవకాశాలు తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కూటమి అభ్యర్థులు గెలుపు పొందెందుకు బాధ్యతగా వ్యవహరించాలని నాయుడుకు చెప్పినట్లు తెలిసింది. 2024 ఎన్నికల తర్వాత స్తబ్దతగా ఉన్న నాయుడు త్వరలో జరగబోయే అన్ని ఎన్నికల్లోను కీలకంగా వ్యవహరిస్తే విజయం సాధించటం తధ్యమవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఆదేశాలే శిరోధార్యంగా భావించి అంకితభావంతో పనిచేసే నాయుడు అధిష్టానం ఇచ్చే ఆదేశాలను ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలలో నాయుడు కీలకపాత్ర పోషించకపోతే పార్టీ అభ్యర్థుల విజయం కష్ట సాధ్యమవుతుందని ఆ పార్టీలోని కీలక వ్యక్తులు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.
రిపోర్ట్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా