మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరించండి ఆర్ డి ఓ కు వైఎస్ఆర్సిపి నేతలు వినతి
మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరించండి – ఆర్డీవోకు వైఎస్సార్‌సీపీ నేతల వినతి
పులివెందుల మేజర్ న్యూస్, :
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్యం, మంచినీరు, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం పులివెందుల రెవెన్యూ డివిజనల్ అధికారి/మున్సిపల్ ప్రత్యేక అధికారికి వినతిపత్రం సమర్పించారు.
గత కొంతకాలంగా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, చెత్త సేకరణ వాహనాల నిర్వహణ సక్రమంగా జరగకపోవడంతో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతున్న పరిస్థితి ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కుక్కలు, పందుల స్వైరవిహారం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుక్కల దాడులతో ప్రజలు గాయపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
పట్టణంలోని పలు ప్రాంతాల్లో బోర్లలో నీటిమట్టం తగ్గడం, మోటార్లు కాలిపోవడం తదితర కారణాలతో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే పనిచేయని వీధి దీపాలను వెంటనే మరమ్మతు చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా పలు కాలనీల్లో డ్రైనేజీ, యూజీడీ సమస్యలను పరిష్కరించి, దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కారం చూపే విధంగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులు, మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
“పులివెందుల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి” అని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు.