ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
ఆర్టీసీ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ను బుధవారం ఆకస్మికంగా సందర్శించి ప్రయాణీకులకు అందుతున్న త్రాగునీరు, టాయిలెట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు తనిఖీ చేశారు. అనంతరం ప్రయాణీకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణీకులతో ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన, మర్యాదగా మాట్లాడుతున్నారా లేదా, బస్సుల సమాచారం సక్రమంగా అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెంలలో ప్రధానమైన బస్టాండ్ లు ఉన్నాయని, ఆర్టీసీ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం ఐవిఆర్ఎస్ విధానం ద్వారా తెలుసుకుంటున్నదన్నారు. ఆ ప్రజాభిప్రాయంలో జంగారెడ్డిగూడెం బస్టాండ్ లో టాయిలెట్లపై ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేసారని, వాటిని పరిశీలించేందుకు, ప్రయాణీకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీ చేశానన్నారు. బస్టాండ్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లు శుభ్రం చేయాలన్నారు. ప్రయాణీకులతో ఆర్టీసీ సిబ్బంది మర్యాదగా మాట్లాడుతూ సేవలందించాలన్నారు. గృహ హింస, పోక్సో, మాదకద్రవ్యాల వినియోగం నియంత్రణ, నిర్మూలనపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటుచేయటమైనది, సదరు నంబర్లను ప్రతీ బస్టాండ్, బస్సులో ప్రజలకు తెలిసేలా ప్రదర్శించాలన్నారు. ఈ సందర్భంగా రెడ్డి గణపవరం నకు బస్సు సర్వీసులు తక్కువగా ఉన్నాయని, సర్వీసులు ఏర్పాటుచేయాలని ప్రజలు కలెక్టర్ ని కోరారు. స్త్రీ శక్తీ పధకానికి మహిళల నుండి మంచి స్పందన వచ్చిందని, దీని కారణంగా బస్సులలో రద్దీ పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సులను మంజూరు చేసేలోగా, ప్రస్తుతం ఉన్న బస్సులనుండి కొత్త సర్వీసులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంక్వయిరీ కౌంటర్, త్రాగునీటి సౌకర్యం, రిజర్వేషన్ కౌంటర్, కార్గో, పార్సిల్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. సిసి కెమెరాలు గురించి ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్గో, పార్సెల్ కేంద్రం శిధిలావస్థలో ఉండడంతో వాటి వివరాలను ఆర్టీసీ ఆర్ఎం షబ్నమ్ ను ప్రశ్నించగా, కొత్త భవనం నిర్మాణానికి 14 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణ పనులు చేపడతామన్నారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడి పారిశుధ్ధ్యం సక్రమంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణ, ఆర్టీసీ ప్రాంతీయ అధికారి షబ్నమ్, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజెర్ కె. వరలక్ష్మి, తహసీల్దార్ స్లీవ్ జోజి, ప్రభృతులు పాల్గొన్నారు.
------------------------------------------------------
కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం