పదవీ విరమణ పొందిన వారికి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆత్మీయ సన్మానం
పదవీ విరమణ పొందిన వారికి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆత్మీయ సన్మానం.
బీరంగూడలో ఘనంగా సన్మాన కార్యక్రమం.. దేవస్థానానికి అందించిన సేవలకు అభినందనలు
అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని బీరంగూడ డివిజన్ పరిధిలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పదవీ విరమణ పొందిన అధికారులను, అర్చకులను ఆత్మీయంగా సన్మానించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి మాచర్ల దేవానాధం, అర్చకులు సువర్ణ రాధాకృష్ణ అవధాని పదవీ విరమణ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ హాజరై, పదవీ విరమణ పొందుతున్న వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు. దేవస్థాన అభివృద్ధికి, భక్తులకు సేవలందించడంలో వారు చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి, దేవస్థానానికి సేవలందించిన వారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.అనంతరం కాట సుధా శ్రీనివాస్ గౌడ్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఆత్మీయంగా సాగింది.