రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక సహాయం
అనంతపురం బ్యూరో: ఉరవకొండ శివారులో గుంతకల్లు ప్రధాన రహదారిపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వజ్రకరూరు గ్రామానికి చెందిన ముగ్గురి కుటుంబాలకు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక సహాయం అందించారు.
ఉరవకొండ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మృతులు జైనుల్లా, మహబూబ్ బాషా, మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వారి కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తరఫున వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.