పోషణ మాసోత్సవాల్లో పౌష్టికాహారంపై అవగాహన
కలిగిరి, మేజర్ న్యూస్ : నాగసముద్రం సెక్టార్ పరిధిలోని బసిరెడ్డి పాలెం అంగన్‌వాడీ కేంద్రంలో జాతీయ 9వ పోషణ మాసోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సీడీపీవో సీహెచ్. పద్మజ కుమారి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పౌష్టికాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంగన్‌వాడీ సిబ్బంది స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, గుడ్లతో పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆయా ఆహార పదార్థాల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను మహిళలకు వివరించారు.కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు అంగన్‌వాడీ కార్యకర్తలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో నాగసముద్రం సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, బిడ్డ తల్లులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.