పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం
అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి: ఎంపీ ఈటల రాజేందర్
శామీర్‌పేట,మేజర్ న్యూస్ (అక్టోబర్ 02):
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సమర సన్నద్ధమవుతున్నాయి. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు, జిల్లా పదాధికారులతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శామీర్‌పేట డివిజన్‌లోని సెలబ్రిటీ రిసార్ట్‌లో శుక్రవారం ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…బీజేపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్ర ఓటర్లను నేరుగా కలుసుకుని పార్టీ అభ్యర్థుల విధానాలను వివరించాలని, ఎన్నికల కార్యాచరణను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ఎన్నికల నేపథ్యంలో మండలాలు, డివిజన్ల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్లను సంప్రదించే విధానం, పార్టీ శ్రేణుల సమన్వయంపై నాయకులకు ఈటల రాజేందర్ దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బంగారి శృతి, రాష్ట్ర నాయకుడు మోహన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి సామా రంగారెడ్డి, మాజీ అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జిల్లాల తిరుమల్‌రెడ్డితో పాటు జిల్లా పదాధికారులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ తాటికొండ రవి గౌడ్.