రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
- జిల్లా స్థాయి కిసాన్ మేళా–2026లో పాల్గొన్న షబ్బీర్ అలీ
సూర్య కామారెడ్డి ప్రతినిధి, కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళా–2026 కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి షబ్బీర్ అలీ మాట్లాడుతూ…రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాగు విధానాలపై అవగాహన కల్పించేందుకు కిసాన్ మేళాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.వ్యవసాయంలో వస్తున్న ఆధునిక మార్పులను రైతులు అందిపుచ్చుకోవాలని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ వ్యవసాయ సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగు సాంకేతికత, పంటలపై శాస్త్రీయ అవగాహన వంటి అంశాల్లో వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే రాష్ట్ర ప్రగతి మరింత వేగవంతమవుతుందని షబ్బీర్ అలీ అన్నారు.కామారెడ్డి జిల్లాలో రైతులకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి రాజగౌడ్, సొసైటీ చైర్మన్లు ఇంద్రకరణ్, సుధాకర్, శ్రీనివాస్, అనంత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ విక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ట్రైనీ ఐఏఎస్ రవి తేజతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.