ఉట్కూరు గురుకుల పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్
నారాయణపేట (ఉట్కూరు), సూర్యన్యూస్: పుస్తకమే విద్యార్థినులకు గొప్ప ఆయుధమని, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధిస్తూ భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక విద్యార్థినులకు సూచించారు. చదువుతోనే ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వాతంత్ర్యం సాధ్యమవుతుందని, ఎవరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడేలా ఇప్పటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని అన్నారు. బుధవారం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని ఉట్కూర్ మండల బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాలలోని తరగతి గదులు, డార్మెటరీ, మరుగుదొడ్లు, వంటగది, స్టోర్ రూమ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు.
స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన పల్లీలతో పాటు ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినులకు అందించే ఆహార పదార్థాల్లో నాణ్యతకు ఎలాంటి రాజీ ఉండకూడదని, నాణ్యమైన సరుకులను మాత్రమే వినియోగించాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం విద్యార్థినుల తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ వారితో నేరుగా మాట్లాడి, చదువులో వారి ప్రగతిని తెలుసుకున్నారు. పలు ప్రశ్నలు అడిగి వారి విషయ పరిజ్ఞానం, చదువు నైపుణ్యాలను పరిశీలించారు. విద్యార్థినులు చదువుపై పూర్తి దృష్టి సారించి, తమతో తామే పోటీ పడుతూ ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు.
ఇంటర్మీడియట్‌లోని రెండు సంవత్సరాలను ఎంతో కష్టపడి చదివితే జీవితాంతం సొంత కాళ్లపై నిలబడే అవకాశం లభిస్తుందని కలెక్టర్ విద్యార్థినులకు తెలిపారు. ఇప్పటి నుంచే భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని, ఏ ఉద్యోగం సాధించాలనే దానిపై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరంతరం కష్టపడి చదివి, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు.
విద్యార్థినులకు మంచి విద్యతో పాటు చక్కటి వాతావరణం, అవసరమైన సౌకర్యాలు అందేలా అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థినులను సొంత పిల్లలుగా భావించి వారి విద్యాభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయాలని ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయినిలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ కమిషనర్ రాజయ్య, గురుకుల పాఠశాల/కళాశాల ఉపాధ్యాయినిలు పాల్గొన్నారు.