ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం..
అమలాపురం మేజర్ న్యూస్ :డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 24వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు స్థానికంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. 24 రోజులుగా తాము రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరవైందని ఆందోళనకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సమ్మెలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తున్న కేవలం రూ. 10,500 అరకొర వేతనంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. చాలీచాలని జీతాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, విధి నిర్వహణలో రేయింబవళ్లు శ్రమిస్తున్న తమను పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం ప్రతినిధులు రామేశ్వరపు శ్రీనివాసరావు, మగాపు రాము, అర్జునరావు, వంటపాటి శ్రీనివాస్, నాగయ్య, లక్ష్మి, లోవలక్ష్మి, భారతి, సత్తులు, గోదశి సత్యనారాయణలతో పాటు స్థానిక వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు వేతనాల పెంపుతో పాటు సర్వీస్ క్రమబద్ధీకరణ చేపట్టేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని వారు స్పష్టం చేశారు.