andhrapradesh
ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం
అనంతపురం:దేశవ్యాప్తంగా సెమీ హైస్పీడ్ రైలు సేవలను విస్తరిస్తున్న భారత రైల్వే శాఖ, ఏపీ ప్రయాణికులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ముంబై - బెంగళూరు మధ్య నడిచే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక వందే భారత్ స్లీపర్ రైలు సేవలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ నూతన రైలు సర్వీస్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంతకల్ రైల్వే స్టేషన్లలో ఆగనుంది. దీనివల్ల రాయలసీమ ప్రాంత ప్రజలకు బెంగళూరు, ముంబై మెట్రో నగరాలకు వేగవంతమైన, అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం లభించనుంది.
గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ అత్యాధునిక స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా అనంతపురం నుంచి కేవలం 3 గంటల 20 నిమిషాల్లోనే బెంగళూరు చేరుకోవచ్చు. అనంతపురం నుంచి బెంగళూరు ప్రయాణానికి సంబంధించి ప్రాథమిక టికెట్ ధరను సుమారు రూ.1,000గా నిర్ణయించగా, ఈ రైలులో మొత్తం 16 ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి.