ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి!ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ రోగులకు అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ చికిత్స, రోగ నిర్ధారణ, నివారణ చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి, నిమ్స్ ఆసుపత్రుల్లో కేన్సర్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్సా విధానాలు, అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఆయా ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలు, చికిత్సలో ఎదురవుతున్న సమస్యలు, వైద్య సదుపాయాల విస్తరణపై చర్చించారు.
జిల్లాల్లో కీమోథెరపీ కేంద్రాలపై ఆరా
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన కీమోథెరపీ కేంద్రాల పనితీరుపై మంత్రి ప్రత్యేకంగా ఆరా తీశారు. జిల్లాల స్థాయిలోనే కేన్సర్ రోగులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులు చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గించేలా జిల్లా ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
కేన్సర్‌పై సమగ్ర నిఘా.. రిజిస్ట్రీ, పోర్టల్ ప్రారంభం
కేన్సర్ వ్యాధిని ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేయాల్సిన వ్యాధిగా ప్రకటించడంతో పాటు, వ్యాధికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు కేన్సర్ రిజిస్ట్రీ, ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా కేన్సర్ కేసుల వివరాలను సమగ్రంగా నమోదు చేయడం, వ్యాధి వ్యాప్తి తీరును విశ్లేషించడం, అవసరమైన వైద్య ప్రణాళికలను రూపొందించడంలో ఈ వ్యవస్థ కీలకంగా ఉపయోగపడనుంది.
నివారణ, ముందస్తు గుర్తింపునకు ప్రాధాన్యం
కేన్సర్ నివారణ, ముందస్తు స్క్రీనింగ్, వ్యాధి నిర్ధారణతో పాటు కేన్సర్ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రజల్లో కేన్సర్‌పై అవగాహన పెంపొందించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం, అవసరమైన చికిత్సను సకాలంలో అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చర్చించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్. చొంగ్తు, ఇతర ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.