జన శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో దర్జీ అడ్వాన్స్‌డ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం
సూర్య , ఆదిలాబాద్ ప్రతినిధి :కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామికవేత్తల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, జన శిక్షణ్ సంస్థ – అదిలాబాద్ నిర్వహిస్తున్న దర్జీ అడ్వాన్స్‌డ్ శిక్షణ కార్యక్రమంలో అదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాన్ని ఉత్సాహంగా ప్రారంభించి, శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జన శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్, ఏం రెడ్డి వర్క్ దర్జీ పనుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు కుట్టుపనిలో మెళకువలు నేర్చుకొని, స్వయం ఉపాధి అవకాశాలను పొందడంతో పాటు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగి, తమ కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో జన శిక్షణ్ సంస్థ అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణలు ఎంతో అభినందనీయమని అన్నారు. కుట్టుపని వంటి వృత్తి నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మహిళలు తమలోని ప్రతిభను వెలికితీసి, స్వయంగా ఉపాధి పొందే స్థాయికి ఎదగవచ్చని తెలిపారు. జన శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో గతంలోనే 20 శిక్షణ బ్యాచ్‌లు విజయవంతంగా పూర్తిచేయడం సంస్థ అందిస్తున్న శిక్షణల నాణ్యతకు, అభ్యర్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంలో సంస్థ చేస్తున్న కృషికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిరుద్యోగ యువతీ యువకులకు, ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని, నేర్చుకున్న నైపుణ్యాలతో భవిష్యత్తులో స్వయం ఉపాధి పొందుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని అభ్యర్థులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా సమాజంలో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇలాంటి కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని చైర్‌పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గంట జీవన్, జన శిక్షణ్ సంస్థ ప్రతినిధులు, శిక్షకులు, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.