అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో నమూనా ఐక్యరాజ్యసమితి సదస్సు
సూర్య కరీంనగర్,: అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల నమూనా ఐక్యరాజ్యసమితి సదస్సు (AISMUN-2026) మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ సంబంధాలు, దౌత్యం, నాయకత్వ లక్షణాలు, ప్రపంచ సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ అనుదీప్ సౌగాని, ముఖ్య అతిథులుగా వివేకానంద విద్యానికేతన్ చైర్మన్, 10వ వార్డు కార్పొరేటర్ కొమురయ్య సౌగాని, మానేరు విద్యాసంస్థల డైరెక్టర్, బైట్‌గో, క్యాంపస్‌హబ్ ఏఐ సంస్థల వ్యవస్థాపకుడు కె. కృష్ణారెడ్డి, శాతవాహన విశ్వవిద్యాలయ సామాజిక శాస్త్ర విభాగ ప్రొఫెసర్ పద్మావతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొమురయ్య సౌగాని విద్యార్థులతో ప్రమాణ స్వీకారం చేయించి సదస్సును అధికారికంగా ప్రారంభించారు. అనంతరం వివిధ కమిటీల్లో విద్యార్థులు తమకు కేటాయించిన దేశాల ప్రతినిధులుగా పాల్గొని అంతర్జాతీయ సమస్యలపై చర్చలు, వాదోపవాదాలు నిర్వహించారు. ప్రసంగ నైపుణ్యం, విమర్శనాత్మక ఆలోచన, సమన్వయం, నిర్ణయ సామర్థ్యాలను ప్రదర్శించారు.
ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులను ప్రపంచ పరిణామాలపై అవగాహన కలిగిన బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దుతాయని అనుదీప్ సౌగాని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన హ్యుమానిటీస్ విభాగం, అద్విత గ్లోబల్ పెర్స్పెక్టివ్స్ ఫెసిలిటేటర్ నితీషతో పాటు ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్లు, సిబ్బందిని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ అభినందించారు.