ఎల్‌నినో ప్రభావంపై పందనపల్లిలో అవగాహన సదస్సు
కట్టంగూరు మండలంలోని పందనపల్లి గ్రామంలో ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ మార్పులు, వాటి ప్రభావాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడం, అధిక ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడి వంటి సమస్యలు తలెత్తే అవకాశాలపై ప్రజలకు వివరించారు.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావం పడకుండా రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని, గ్రామంలో నీటి వనరులను సంరక్షించుకోవాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె. అనిల్ కుమార్ రెడ్డి, ఉపసర్పంచ్ వీరేందర్, గ్రామపంచాయతీ కార్యదర్శి బి. రేణుక, సంధ్యతో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.