వెల్దుర్తి బీసీ హాస్టల్, గురుకులాన్ని తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్చరిక
వెల్దుర్తి (మేజర్ న్యూస్):కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని బీసీ సంక్షేమ వసతి గృహం (హాస్టల్) మరియు బీసీ గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్. సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతులు, భోజన నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వంటగది, స్టాక్ రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలని, నీటి వసతి మరియు పరిసరాల పరిశుభ్రత (శానిటేషన్)పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ మాట్లాడుతూ — విద్యార్థుల సంక్షేమ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. వార్డెన్లు, అధికారులు కేటాయించిన స్థానాల్లోనే ఉంటూ విధులను సక్రమంగా నిర్వహించాలని, విధుల్లో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, వార్డెన్లు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.