మేయర్, డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం.. ట్రాఫిక్ ఆంక్షలు
విజయవాడ, మేజర్ న్యూస్: విజయవాడ నగరపాలక సంస్థ నూతన మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో నవంబర్ 23న అంబేద్కర్ కళావేదిక వద్ద పటిష్టమైన భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టినట్లు నగర పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అంబేద్కర్ కళావేదికను కౌన్సిల్ హాల్‌గా నోటిఫై చేయగా, జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను ప్రత్యేక ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం తదితర అధికారులు కార్యక్రమ వేదికను, పరిసర ప్రాంతాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. కోర్టుల జంక్షన్, ఆర్‌ఐఓ జంక్షన్, డీసీపీ బంగ్లా, స్టేట్ గెస్ట్ హౌస్, రాఘవయ్య పార్క్, పాత రైతు బజార్ రోడ్డు, రెడ్ సర్కిల్ ప్రాంతాల్లో కటాఫ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నవంబర్ 23న ఉదయం 11 గంటల నుంచి కార్యక్రమం ముగిసే వరకు ఆయా ప్రాంతాల్లో సాధారణ ప్రజలు, వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయి. కోర్టుల జంక్షన్, పాత రైతు బజార్ రోడ్డు, స్టేట్ గెస్ట్ హౌస్ మార్గాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించడంతో పాటు ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మేయర్, కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యుల వాహనాలకు గేట్ నంబర్ 5 వరకు అనుమతించి సెల్లార్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. కుటుంబ సభ్యులు, ఆహ్వానితులు గేట్ నంబర్ 2 వద్ద దిగి అధికారిక పాసులతో కేటాయించిన గ్యాలరీల్లో కూర్చోవాలి. వారి వాహనాలకు కళాక్షేత్రం వెనుక ఉన్న క్యాంటీన్ ఓపెన్ పార్కింగ్‌లో స్థలం కేటాయించారు. మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కుటుంబ సభ్యులు, ఆహ్వానితులు హాల్ నుంచి బయటకు వెళ్లాలని, అనంతరం సభ్యుల సమక్షంలోనే డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమం జరిగే సమయంలో సాధారణ ప్రజలకు పరిసర ప్రాంతాల్లోకి అనుమతి ఉండదని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆహ్వానితులు సకాలంలో చేరుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.